(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Comments : జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకూ ఎందుకు డబ్బులు ఇవ్వలేదు - జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న
Andhra Politics : జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటి వరకూ నిధులు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Elections 2024 : ఏపీలో పథకాలకు డబ్బులు విడుదల చేయకపోవడం వివాదాస్పదమయింది. పోలింగ్ ముందు ఓటర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. కానీ ఈసీ మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాతనే జమ చేయాలని సూచించింది. ఈ విషయంపై చంద్రబాబునాయుడు ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించారు. కురుపాంలో ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరిలో బటన్ నొక్కితే ఇంత కాలం ఎందుకు జమ కాలేదని ప్రశ్నించారు. డీబీటీ అంటే 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు రావాలా, లేదా? ఫోన్ లో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ లోకి ఒక గంటలో డబ్బులు బదిలీ అయిపోతాయి. జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్ రెడ్డీ? పేదవాళ్ల అకౌంట్లో ఎందుకు డబ్బులు పడలేదని ప్రశ్నించారు.
ఉత్తుత్తి బటన్ల రాజకీయం వద్దు ఇంటికిపోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కాను, డబ్బులు పడలేదు అంటున్నాడని మండిపడ్డారు. నువ్వు నొక్కింది ఉత్తుత్తి బటన్ ఖజానా ఖాళీగా ఉందన్నారు. నువ్వు నొక్కిన బటన్ పేదలకు కాదు, దళారీలకు కాదు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు రూ.16 వేల కోట్లు దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు. జలగ జగన్ దళిత, గిరిజన ద్రోహి. అందరినీ మోసం చేశాడన్నారు. ఓట్లేశారు కాబట్టి జగన్ గిరిజన ప్రాంతాల్లో ఏవైనా పనులు చేస్తాడనుకున్నానన్నారు. ఓట్లేసే వాళ్లను కాటేసే రకం ఈ జలగ జగన్. అభివృద్ధి జరిగిందా... ఒక్క రోడ్డయినా వేశాడా? ఒక స్కూలు కట్టాడా... ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందా అని ప్రశ్నించారు.
కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమె ఆదివాసీ బిడ్డ అని వెల్లడించారు. మీ ఇంటిలో ఒక బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని, జగదీశ్వరిని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి గీత పోటీ చేస్తున్నారని, కమలం పువ్వుపై ఓటేసి ఆమెను గెలిపించాలని అన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఎండలు మండిపోతున్నా ప్రజల ఉద్ధృతి తగ్గడం లేదని, ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవడం ఖాయమని, ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని, ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో పడేయాలని అన్నారు.
ఎంతో పేదలైన గిరిజనులు ఉండే నియోజకవర్గం ఇది. అలాంటి పేదల కోసం నేను 16 పథకాలు తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. పేదవాళ్లందరికీ పింఛన్లు ఇస్తాను. రూ.200 పింఛను రూ.2 వేలు చేసింది నేనే. పింఛన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. ఇంటివద్దనే రూ.4 వేల పెన్షన్ ఇస్తాను. ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు జులైలో రూ.12 వేలు వస్తాయి. ఎప్పుడైనా జలగ జగన్ ఇలాంటి ఆలోచనలు చేశాడా? జగన్ వచ్చాక బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! అన్నీ ధరలు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. మేం అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తామన్నారు.
మహాశక్తి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు.1,500 ఇస్తాం. సంవత్సరానికి రూ.18,000 చొప్పున ఐదేళ్లలో రూ.90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే ఐదేళ్లలో రూ.2.70 లక్షలు ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అన్నదాత రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. భవిష్యత్ లో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ వస్తుందన్నారు.