Jamili Elections: ఈ నెల 16న లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు - కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు
National News: దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి ఈ నెల 16న లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద సభలో ప్రవేశపెడతారు.
Jamili Election Bill Will Introduced On 16th December: దేశంలో జమిలి ఎన్నికలకు (Jamili Elections) సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్' విషయంలో 2 బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 16న జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభ ముందుకు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అధికార బీజేపీ ఈ ప్రక్రియలో కీలక ప్రణాళిక అమలు దిశగా అడుగులు వేస్తోంది.
కాగా, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానించేందుకు, చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో సహా 2 ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా.. మరొకటి సాధారణ బిల్లు. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలను సవరించేందుకు సాధారణ బిల్లును తీసుకొస్తున్నారు. అయితే, క్యాబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా పట్టుబట్టడంతో ఇవి ఆమోదం పొందాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
కోవింద్ కమిటీ సిఫార్సు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రస్తుతానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలనూ వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది.
కేంద్రం వ్యూహాత్మక అడుగులు
ఈ బిల్లులకు సంబంధించి కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మద్దతు అవసరం. ఎన్డీయేకు అంత బలం లేకపోవడంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. 542 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తోన్న కేంద్రం.. వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే.. ముందు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పరిమితిని తగ్గించాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిమితి పెంచాలి. కానీ పెంచడానికి అనుమతి లభిస్తుంది కానీ తగ్గించడం సాధ్యం కాదు. వీటన్నింటిపై వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Lookback 2024: రాబోయే సంచలనాలకు 2024 పునాది - 2025లో జమిలీ ఎన్నికలపై కీలక మలుపులు !