మరికొన్ని గంటల్లో మునుగోడు పోలింగ్- హైదరాబాద్‌లో టెన్షన్ టెన్షన్
మునుగోడు వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బయల్దేరారు. మార్గమధ్యలో మలక్‌పేట వద్ద ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లుపైకి వచ్చాయి.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు కొన్ని గంటల ముందు నుంచే హైడ్రామాలు మొదలయ్యాయి. అర్థరాత్రి ఆర్వో ఆఫీస్ వద్ద రాజగోపాల్ రెడ్డి ధర్నా చేస్తే... బీజేపీ నేతలు మునుగోడుకు పయనమయ్యారు. వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
మునుగోడు వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బయల్దేరారు. మార్గమధ్యలో మలక్‌పేట వద్ద ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లుపైకి వచ్చాయి. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
బండి సంజయ్ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మలక్‌పేట వద్ద ఉద్రికత్త నెలకొంది. కాసేపు పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... మంత్రులు ఇంకా నియోజకవర్గంలో ఉన్నా పట్టించుకోవడం లేదంటూ మునుగోడు బైపోల్‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు సంఘీభావం చెప్పేందుకు బండి సంజయ్ చండూరు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
Started to Munugode from @BJP4Telangana office in support to Shri @krg_reddy garu's Dharna against presence of Outsiders in Munugode constituency. pic.twitter.com/6njaWNXc1Y
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2022
మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు మకాం వేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధర్నా చేశారు. చండూర్ ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో వచ్చి ఆర్వోతో మాట్లాడారు. అనంతరం ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాను రాజీనామా చేశానని... ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. రూల్స్‌కు విరుద్ధంగా తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేశారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ధర్నాకు దిగారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక టీఆర్‌ఎస్ నాయకలు ఇళ్లల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని తెలిపారు.
స్థానికేతరులు ఉన్నారని ఆర్వోకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలీసులు పూర్తిగా బిజెపి నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. కేంద్ర బలగాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా గ్రామలలో ఎటువంటి భద్రత రక్షణ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల రోజుల నుండి తనపై తన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మంగళవారం ప్రచారం ముగిసిన నుంచి బయట వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నేతలు మునుగోడు నియోజకవర్గంలో ఉంటున్నారని ఆక్షేపించారు. తనపై దాడి కారణంగా నియోజకవర్గంలో ఉండే పరిస్థితి లేదన్నారు. తాను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసమని... ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని అనుకుంటున్నామన్నారు. బయట వ్యక్తులు మునుగోడు నియోజకవర్గం నుంచి వెళ్లిపోయేవరకు ధర్నా చేస్తామన్నారు.
పోలీస్ అధికారులు కానీ జిల్లా ఎస్పీ కాని రెండు రోజులుగా ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. బయట వ్యక్తుల్ని వెంటనే పంపించాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా...? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో మూటల కట్టలతో మునుగోడు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆక్షేపించారు.
మునుగోడులో ఓటమి ఖాయమైపోయిందని గ్రహించిన బీజేపీ కొత్త డ్రామాలకు తెరతీసిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అపారంగా ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మునుగోడు నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మునుగోడులో గెలవలేక... ఓటమి భయంతో దింపుడు కళ్లెం ఆశలతో రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజగోపాల్ రెడ్డి తాపత్రయమంతా సానుభూతి పొందేందుకేనన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన ధర్నా కార్యక్రమంతో పోలీసులతో బలవంతంగా అరెస్టు చేపించుకొని సానుభూతి పొందే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డిదని విమర్శించారు.
రాజగోపాల్ రెడ్డి డ్రామాల ట్రాప్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పడొద్దని సూచించారు. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. తమకు నిర్దేశించిన ఎన్నికల పనులను కొనసాగించాలన్నారు.