PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
తెలంగాణతోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే ఎన్నిక నగారా మోగనుంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.. పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచుతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ కూడా ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలను మద్దతుగా జాతీయ స్థాయి నాయకులకు కూడా ప్రచారంలో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. వచ్చే వారం రోజుల్లో... మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోడీ. వచ్చే వారంలో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుల వివరాలను సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే మంత్రిత్వ శాఖను కోరారు ప్రధాని. దీంతో.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, కార్యక్రమాల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ కార్యక్రమాల జాబితాలో ఎక్కువగా రోడ్డు, రైల్వే ప్రాజెక్టులే ఉన్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 1న ప్రదాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు ప్రధాని. 1:35గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ వెళ్తారు. 2గంటల 10 నిమిషాలకు మహబూబ్‌నగర్ హెలిపాడ్ దగ్గరకు చేరుకుంటున్నారు. 2:15 గంటల నుంచి 2:50 వరకు మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 3గంటలకు బహిరంగ సభ వేదిక చేరుకుని.. 4గంటల వరకు సభ వద్దే ఉంటారు. 4గంటల 10 నిమిషాలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 4:45కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.. 4:50కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్తారు. ఆ తర్వాత.. అక్టోబర్ 3న మళ్లీ తెలంగాణ పర్యటనకు వస్తారు ప్రధాని మోడీ. 3వ తేదీన నిజామాబాద్‌లో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభింస్తారు. నిజామాబాద్‌లోని జీజీ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ సభకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 2న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. గ్వాలియర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. PM స్మార్ట్ సిటీ ప్రవేశ ద్వారం, థీమ్ రోడ్, INTUC గ్రౌండ్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా గ్వాలియర్‌లోని ఫెయిర్ గ్రౌండ్‌లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు. ఈ సందర్భంగా లాడ్లీ బ్రాహ్మణ యోజన యొక్క ఐదవ విడత నగదు కూడా విడుదల చేస్తారని సమాచారం.
అక్టోబర్ 2వ తేదీనే ప్రధాని మోడీ రాజస్థాన్‌లో పర్యటన కూడా ఉంది. సెప్టెంబరు 25న రాజస్థాన్‌లో పర్యటించారు ప్రధాని మోడీ. వారం రోజుల్లో మరోసారి రాజస్థాన్ వెళ్తున్నారు. ఈసారి చిత్తోర్‌గఢ్‌లో పర్యటించనున్నారు ప్రధాని. చిత్తోర్-నీముచ్ రైల్వే లైన్ డబ్లింగ్, దబోక్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. చిత్తోర్‌గఢ్‌లో ప్రధాని మోడీ సభకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని రాజస్థాన్ బీజేపీ నేతలు తెలపారు.