Sarpanch Auction: పంజాబ్‌లో రూ. 2 కోట్లు పలికిన సర్పంచ్ స్థానం - వేలంలో దక్కించుకున్న బీజేపీ నేత
'Auction' for 'Sarpanch': పంజాబ్‌లోని ఒక గ్రామ సర్పంచ్ పదవి కోసం జరిగిన వేలం పాట రూ.2 కోట్ల దగ్గర ముగిసింది. ఆ మొత్తాన్ని చెక్కుగా ఇచ్చిన బీజేపీ నేత ఆ గ్రామం తదుపరి సర్పంచ్‌గా ఎన్నికవనున్నారు.
Auction for Sarpanch In Punjab: పంజాబ్‌లో 2018 తర్వాత తొలిసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో వేలంపాటలు కూడా జరుగుతున్నాయి. కొన్ని ఊర్లలో రూ.60 లక్షల వరకూ వేలం నడిచింది. గురుదాస్ పూర్ పరిధిలోని ఒక విలేజ్‌లో అయితే బీజేపీ నేత సర్పంచ్ పదవిని ఏకంగా రూ.2 కోట్లకు దక్కించుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
అక్టోబర్ 15న పంచాయతీ ఎన్నికలు:
2018 డిసెంబర్‌లో చివరిసారిగా పంజాబ్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలు ఈ అక్టోబర్ 15న ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. 13,327 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 19,110 పోలింగ్ బూత్‌లు సిద్ధం చేస్తున్నారు. దాదాపు కోటీ 33 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాదారణంగా పంచాయతీ ఎన్నికలు అంటే ఆ రాష్ట్రాన్ని దాటి బయట రాష్ట్రాలకు పెద్దగా ఆసక్తి ఏమీ ఉండదు. కానీ ప్రస్తుతం పంజాబ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశం యావత్ దృష్టిని పంజాబ్ పంచాయతీ ఎన్నికల వైపు తిప్పాయి. అవే సర్పంచ్ పదవుల కోసం వేలంపాటలు. ఆ వేలం పాటల్లో అధికార ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. MLA అమోలిక్ సింగ్ స్వయంగా ఒక గ్రామసభలో పాల్గొనడమే కాక.. అక్కడికి తాను సర్పంచ్ క్యాండిడేట్‌ను ప్రకటించడానికి రాలేదని, సర్పంచ్ పేరు చెప్పడానికి వచ్చానని చెప్పడం సంచలనం రేపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే పదవిలో ఉన్న MLAలు ఇలా వ్యవహరించడం ఏంటని రాజకీయ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
AAP MLA Amolik Singh says, I are not here to announce the candidate, I am here to announce Sarpanch.
— Ramandeep Singh Mann (@ramanmann1974) September 30, 2024
What is going on in Punjab, bid for sarpanchi post has crossed 2 crore, AAP MLA's are announcing Sarpanch posts, without elections, this is the murder Panchayati Raj system ! pic.twitter.com/JmMxTdNf9c
రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లకు..
గురుదాస్ పూర్ పరిధిలోని హర్‌దోవల్ కలాన్ గ్రామం దేశం యావత్ దృష్టిని ఆకర్షించింది. ఈ నెల 15న జరగనున్న సర్పంచ్ ఎలక్షన్ కోసం జరిగిన వేలం రూ.2 కోట్లకు చేరడం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ మొత్తాన్ని బీజేపీ స్థానిక నేత ఆత్మసింగ్ పాడారు. తన తండ్రి కూడా గతంలో సర్పంచిగా చేశారు. ఈ మొత్తాన్ని ఆత్మ సింగ్ ఒక చెక్కు రూపంలో గ్రామ పెద్దలకు అందించారు. ఈ మొత్తంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆత్మసింగ్ తెలిపారు. ఆ అభివృద్ధి పనులను ఊర్లోని గ్రామ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ గ్రామం ఆ చుట్టుపక్కల చాలా ప్రభావవంతమైన గ్రామం కావడంతో ఈ స్థాయిలో వేలంపాట జరిగనట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ గ్రామానికి పంచాయతీ ల్యాండ్ 300 ఎకరాల వరకు ఉంది. బఠిండా పరిధి గెహ్రీ బుట్టార్ గ్రామంలోనూ వేలం పాట రూ.60 లక్షల వరకూ వెళ్లింది. అయితే దీనిపై ఇంకా ఆ గ్రామపెద్దలు అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలా పంజాబ్‌లోని అనేక గ్రామాల్లో వేలంపాటలు జరుగుతుండడంతో పంజాబ్‌లో ఏం జరుగుతోందని యావత్ భారతం ఆసక్తిగా గమనిస్తోంది.
A BJP leader offered ₹2 crore for the Sarpanch election bid in Hardowal Kalan, Gurdaspur. The bidding started at ₹50 lakh and reached ₹2 crore. The village has the largest panchayat in Gurdaspur, with 300 acres of land. pic.twitter.com/433Up9llBG
— Gagandeep Singh (@Gagan4344) September 30, 2024
పంజాబ్‌లో ఒక సర్పంచ్ స్థానం కోసం రూ.2 కోట్ల వరకూ వెచ్చించారన్న వార్త రాజకీయవర్గాల్లో విమర్శలకు దారి తీసింది. ఇలా రూ.కోట్లు వెదజల్లి స్థానిక సంస్థల స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ విపక్ష నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ బజ్వా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగానికి 73వ సవరణ ద్వారా పంచాయతీ ఎన్నికల చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం రాజకీయ పార్టీలు ఏవీ పంచాయతీ ఎన్నికల్లో కలుగ చేసుకోకూడదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు గ్రామల్లో తమ పట్టు నిలుపుకోవడమే ప్రధాన లక్ష్యంగా అవి కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో పంచాయతీ ఎన్నికలు కూడా చాలా కాస్ట్‌లీగా మారాయి. సామాన్యులు కనీసం సర్పంచ్ పదవికి కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోతోందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.