(Source: ECI/ABP News/ABP Majha)
CM YS Jagan: ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ - ప్రశాంత్ కిషోర్‌పై పంచ్‌లు - ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారంటే ?
Vijayawada News: 2019లో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సాధించబోతున్నామని వైసీపీ అధినేత జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐ ప్యాక్ ఆఫీసులో.. పార్టీ కోసం పని చేసిన వారిని ఉద్దేశించి మట్లాడారు.
AP CM YS Jagan Confidence of Winning AP Assembly Election 2024: మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ అధినేత, సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఐ ప్యాక్ ఆఫీసుకు జగన్ వెళ్లారు. పార్టీ కోసం పని చేసిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని అన్నారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని ప్రకటించారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని.. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.
ఇండియన్ పొలిటికల్ యాక్ష్షన్ కమిటీ వైసీపీ కోసం స్ట్రాటజిస్టుగా పని చేసింది. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ లో ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పీకేతో ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అంతా తానై వ్యవహరించారు. ఆ తర్వాత ఐ ప్యాక్ తరపున తమిళనాడు, బెంగాల్ లో డీఎంకే, టీఎంసీలకు పని చేశారు. అక్కడ కూడా ఆయన పని చేసిన పార్టీలకు విజయాలు సాధించి పెట్టారు. తర్వాత ఐ ప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. సొంత సంస్థను పెట్టుకుని బీహార్ లో పాదయాత్ర చేశారు. కానీ ఆ సంస్థను రాజకీయ పార్టీగా తీర్చిదిద్దలేకపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
అయితే దేశంలో సుప్రసిద్ధమైన ఎన్నికల స్ట్రాటజిస్టుగా ఉన్న ఆయన ఇటీవల చాలా మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఏపీలో వైసీపీ చాలా భారీగా ఓడిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలా చెప్పడంపై వైసీపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఐ ప్యాక్ మీటింగ్ లోనూ జగన్ ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేనన్ని సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర కిందట.. జగన్ ను ఢిల్లీలో కలిసినప్పుడు కూడా తాను ఆయన ఓడిపోతున్నట్లుగా చెప్పానని పీకే ఇంతకు ముందే ఓ ఇంటర్యూలో చెప్పారు.
ప్రస్తుతం వైసీపీకి పని చేసిన ఐ ప్యాక్ టీమును రిషిరాజ్ సింగ్ అనే స్ట్రాటజిస్ట్ లీడ్ చేశాడు. వారితో కూడా ఆ ప్యాక్ కాంట్రాక్ట్ ముగిసిందని చెబుతున్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే ఐ ప్యాక్ తో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని..లేకపోతే ఇక ఐప్యాక్ సేవలు కొనసాగించరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తో మీటింగ్ తర్వాత ఐ ప్యాక్ సభ్యులంతా.. సొంత ప్రాంతాలకు వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి.