UPSC: పూజా ఖేడ్కర్ ఎఫెక్ట్- యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా
UPSC Chairperson Resign: యూపీఎస్సీ ఛైర్ పర్సన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామాా చేశారు. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
UPSC Chairperson Manoj Soni resignation: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. తన పదవీకాలం ఇంకా ఐదేళ్లు మిగిలి ఉండగానే అత్యున్నత హోదా నుంచి తప్పుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను కేంద్రం ఇంకా ఆమోదించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది.
ఇటీవలి పరిణామాలే కారణమా..?
దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. మరోవైపు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారం రోజురోజుకూ దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి యూపీఎస్సీ ఆమెపై కేసు కూడా నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది. ఇక ముందు ఆమె సివిల్స్ రాయకుండా డిబార్ చేయాలని ఆదేశించింది. ఆమెకు షోకాజ్ నోటీసులను సైతం అందజేసింది. ఈ పరిస్థితుల్లో మనోజ్ సోనీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మనోజ్ సోని రాజీనామాకు ఈ వివాదాలకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల నెల కిందటే ఆయన వైదొలిగారని అంటున్నారు.
అయిదేళ్ల ముందుగానే..
యూపీఎస్సీ ఛైర్మన్‌గా మనోజ్ సోనీ 2029 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. అయిదేళ్లు ముందుగానే ఆయన అత్యున్నత పదవి నుంచి తప్పుకున్నారు. సోనీ గతంలో యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత 2023లో యూపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ప్రధానమంత్రికి నమ్మకస్తుడిగా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా మనోజ్ సోనికి పేరుంది. 2005లో వడోదరలోని ప్రఖ్యాత మహారాజా సయ్యాజీ రావు యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌గా ఎంపిక అయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 40 సంవత్సరాలే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛైర్మన్‌గా ఘనత వహించారు.
సన్యాసం స్వీకరించనున్నారా?
మనోజ్ సోని యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడం వెనుక మరో నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్వామినారాయణ్ బోధనలను అనుసరిస్తూ అనుపమ్ మిషన్ ద్వారా 'నిష్కామ యోగి'గా మారాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పూజా ఖేడ్కర్ సెలెక్షన్‌ని రద్దు చేసిన యూపీఎస్సీ..
పుణే IAS ట్రైనీ పూజా ఖేడ్కర్ ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారాన్ని యూపీఎస్సీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఆమెపై తదుపరి చర్యలకు యూపీఎస్‌సీ సిద్ధమైంది. తప్పుడు ధ్రువపత్రాలు చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఆమె నియామకాన్ని రద్దు చేయనుంది. మోసం చేసినందుకు కేసు కూడా నమోదు చేసింది. రిక్రూట్‌మెంట్ సమయంలో తనకు మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉందని చెప్పి ఆ కోటాలో సెలెక్ట్ అయింది. అంతే కాదు. తన తల్లిదండ్రుల పేర్లనీ తారుమారు చేసింది. సివిల్ సర్వీస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యేందుకు ఇలా అధికారులనే బోల్తా కొట్టించింది. వెంటనే పూజా ఖేడ్కర్‌పై చర్యలు తీసుకోవాలని UPSC నోటీసులు జారీ చేసింది. కేసు పెట్టడంతో పాటు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పూజా ఖేడ్కర్ ఇచ్చే రిప్లై ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌లోనూ యూపీఎస్‌సీ రాయకుండా నిషేధం విధించింది.