TS 10th Class Supplementary Exams: 'టెన్త్' ఫెయిల్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
TS SSC Supplementary Exams: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
TS 10th Class Supplementary Exams 2024: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అయితే ఫలితాల వెల్లడి సమయంలోనే పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. దీనిప్రకారం జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలతో సంబంధం లేకుండా పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థులందరూ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరుకావాలని విద్యాశాఖ సూచించింది.
తెలంగాణ పదోతరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులు మే 16 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. పదోతరగతి ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.500 ఫీజు చెల్లించాలి. ఇక రీవెరిఫికేషన్, డూప్లికేట్ క్వశ్చన్ పేపర్స్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మే 15 లోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాథ్యాయులతో సంతకం చేయించిన దరఖాస్తులో హాల్‌టికెట్లు జతపరిచి డీఈవో ఆఫీస్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మాత్రమే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. కొరియర్, పోస్టు చేసిన దరఖాస్తులు స్వీకరించేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారు.
ఫలితాల్లో బాలికలదే హవా..
తెలంగాణ పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేటు స్కూల్స్ కావడం గమనార్హం. ఫలితాల్లో 99.09 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండోస్థానంలో, 98.27 శాతం ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది.
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చి 18తో పరీక్షలు ప్రారంభంకాగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగిశాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.