Inter Practicals: ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, హాజరుకానున్న 4 లక్షలకు పైగా విద్యార్థులు
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
TS Intermediate Practical Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ థియరీ పరీక్షకు 80 మార్కులకు ఉండనుండగా.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు ఉండనున్నాయి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్షల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు కళాశాలలకు హెచ్చరికలు జారీచేసింది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కళాశాలల నుంచి మొత్తం 4,16,622 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 3,21,803 మంది, ఒకేషనల్ విద్యార్థులు 94,819 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే కళాశాలలకు చేరాయి. విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపల్స్ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పకడ్భందీ ఏర్పాట్లు...
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రదబాయి తెలిపారు. ఎగ్జామినర్స్‌ను నియమించుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయిన వెంటనే ఆన్లైన్లో స్టూడెంట్ల మార్కులను అప్లోడ్ చేస్తామన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు..
మొత్తం విద్యార్థులు: మొత్తం 4,16,622
🔰 ఎంపీసీ విద్యార్థులు: 2,17,714
🔰 బైపీసీ విద్యార్థులు: 1,04,089
🔰 ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థులు: 48,277
🔰 ఒకేషనల్ సెకండియర్ విద్యార్థులు: 46,542
అరగంట ముందే క్వశ్చన్ పేపర్..
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంది. క్వశ్చన్ పేపర్లను ఆన్లైన్లో పెట్టి, ఎగ్జామినర్‌కు వచ్చే పాస్‌వర్డ్ ద్వారా మాత్రమే నిర్ణీత సమయానికి అరగంట ముందు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. దీంతో పేపర్ లీక్ కాకుండా ఉండే అవకాశముంది. దీంతోపాటు వాల్యుయేషన్ కూడా వెంటనే చేసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే వాల్యుయేషన్ చేసి.. ఆ వెంటనే ఆన్లైన్లో మార్కులు వేయనున్నారు. దీనివల్ల మార్కులు వేసే దాంట్లోనూ అక్రమాలను అరికట్టే అవకాశం ఉంది.