TS EdCET Results: టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాల తేదీపై కన్వీనర్ ప్రకటన.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) పరీక్షలకు 80.5 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఎడ్‌సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీన పరీక్ష 'కీ' విడుదల చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ )- 2021 ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 80.5 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఎడ్‌సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 54, ఏపీలో 4 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎడ్‌సెట్ పరీక్ష కోసం మొత్తం 34,185 మంది హాజరయ్యారని తెలిపారు. 8214 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. హాజరు శాతం 80.5గా నమోదైందని చెప్పారు.
ఈ నెల 29వ తేదీన పరీక్ష 'కీ' విడుదల చేస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఎడ్‌సెట్ - 2021 పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 10వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఈ పరీక్షల ద్వారా 2021 - 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు చేపట్టనుంది.
ఎడ్‌సెట్ పరీక్షల్లో పలు మార్పులు..
ఎడ్‌సెట్ పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బీఏ, బీఎస్సీ, బీకామ్ లాంటి కోర్సులు చదివిన వారితో పాటుగా ఇతర సబ్జెక్టులతో డిగ్రీ పాస్ అయిన వారు కూడా బీఈడీ చేయవచ్చని తెలిపింది. దీని ప్రకారం బీఏ (ఓరియెంటల్ లాంగ్వేజెస్), బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీబీఏ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులతో పాస్ అయితే సరిపోతుందని చెప్పింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతోన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ఎడ్‌సెట్ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) నోటిఫికేషన్ విడుదలైంది. వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 17వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు గడువు ఆగస్టు 17తో ముగిసింది. ఆలస్య రుసుముతో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష సెప్టెంబరు 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
Read More: AP EdCET 2021: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: TS Eamcet counselling: మరో 5 రోజుల్లో టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..