AP EdCET 2021: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్‌సెట్ ) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17తో ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్‌సెట్ ) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభం కాగా, ఆగస్టు 17వ తేదీతో ముగియనుంది. ఆలస్య రుసుముతో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే.విశ్వేశ్వరరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష సెప్టెంబరు 21న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
విద్యార్హత వివరాలు..
బీఏ /బీఎస్సీ /బీఎస్సీ (హోం సైన్స్) /బీకాం /బీసీఏ/ బీబీఎం పూర్తయిన లేదా చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న డిగ్రీలలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. బీఈ /బీటెక్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలు రూ.450, బీసీలు రూ.500, మిగతా అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము రూ.1000తో ఆగస్టు 24వ తేదీ వరకు, రూ.2000తో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దరఖాస్తుల్లో సవరణలకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అవకాశం కల్పించింది. హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం అవుతుంది. 2021 జూలై 1 నాటికి 19 ఏళ్లు పూర్తయిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష కేంద్రాలు..
అనంతపురం, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, కడప, కర్నూలు, నంద్యాల, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.
ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ ఎడ్‌సెట్
తెలంగాణలో టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్ ) - 2021 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2021 - 22 విద్యా సంవత్సరానికి గానూ టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించనుంది. పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 19 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీని ద్వారా రెండేళ్ల కాలవ్యవధి కలిగిన బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.