TS SSC Fees: ‘పది’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?
SSC Exam Fees: పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు నవంబరు 15న ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana SSC Exam Fees Last Date : పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు నవంబరు 15న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ఈ ఫీజులను విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని సూచించారు. వాస్తవానికి మందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించడానికి నవంబరు 17 వరకు అవకాశం కల్పించారు. అయితే ఈ గడువును ఆలస్యరుసుము లేకుండా తాజాగా డిసెంబరు 2 వరకు పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఫీజు చెల్లింపు తేదీలు..
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 02.12.2023.
➥ రూ.50 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.12.2023.
➥ రూ.200 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.12.2023.
➥ రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 03.01.2024.
ఫీజు చెల్లింపు వివరాలు..
➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125
➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.110
➥ 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.
➥ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.60.
వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
* కుంటంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని తెలిపారు. గతేడాది నుంచి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇక మీద నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అక్టోబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్‌రోల్స్‌ను పంపిస్తాయి. అనుమతి లేని పాఠశాలల్లో చదివే పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్‌లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారు.
ఏపీలోనూ పొడిగింపు..
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి నవంబరు 9న ఆదేశాలు జారీ చేశారు. ఫీజు దరఖాస్తు గడువు నవంబరు 10తో ముగియనుండగా.. విద్యార్థుల సౌలభ్యం కోసం మరో 10 రోజులపాటు అవకాశం కల్పించారు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబరు 20 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆపై రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొన్నారు.
రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 21 నుంచి 25 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 26 నుంచి 30 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 నుంచి 5 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి..