By: ABP Desam | Updated at : 02 Jan 2023 01:16 PM (IST)
Edited By: omeprakash
తెలంగాణ పదోతరగతి పరీక్షలు
తెలంగాణలో పదోతరగతి పరీక్షల్లో మార్పులకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. 11 పేపర్లుగా పరీక్షలను 6 పేపర్లకు కుందించారు. అయితే ఈ సంస్కరణల చుట్టే ఇప్పుడు వివాదం రేగుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు సందిగ్ధంలో పడ్డారు.
ఇటీవల పదోతరగతి పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్ పేపర్లనూ ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ మోడల్ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి. పరీక్షల నాటికి పూర్తి సలబస్ కూడా పూర్తిచేయలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విద్యార్థులకు నష్టం కలుగవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే ఉన్నాయి. వీరిలో కనీసం 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్లు ఇటీవలి అంచనాల్లో వెల్లడైంది.
తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పదోతరగతి పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..
గ్యాప్ లేకుండా పరీక్షలతో ఒత్తిడే..
సీబీఎస్‌సీ సిలబస్‌తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య కచ్చితంగా గ్యాప్ ఉంటుంది. రాష్ట్ర బోర్డు మాత్రం ఈ విధానాన్ని పాటించడం లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు. అయితే ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో పరీక్షల మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు.
చాయిస్ పెంచితేనే ప్రయోజనం..
ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్‌లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు.
విద్యార్థుల్లో ఆందోళనకు కారణాలివే..
➥ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్లుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం.
➥ వ్యాసరూప ప్రశ్నల తీరును కూడా కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోతారు. దీంతో విద్యార్థులు మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు.
➥ సైన్స్ సబ్జెక్టులో రెండు పేపర్లు ఉండగా.. రెండింటిని ఒకే పేపర్ కిందకి మార్చారు. కాకపోతే వేర్వేరుగా సమాధాన పత్రాలు ఇస్తారు. వీటిలో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి, బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
➥ పరీక్ష సమయం మొత్తం 3 గంటలు ఉండగా.. ఇందులో 6 వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుంది. ఒకవేళ ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదు. కాబట్టి వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!