Engineering Classes: ఇంజినీరింగ్ తరగతులు వచ్చేవారం ప్రారంభం! బి-కేటగిరీ సీట్ల భర్తీకి గడువు పెంపు!
నవంబరు 2 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 25న ఓయూ, జేఎన్‌టీయూహెచ్ అధికారులతో మాట్లాడారు..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తరగతులు నవంబరు మొదటివారంలో ప్రారంభంకానున్నాయి. నవంబరు 2 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 25న ఓయూ, జేఎన్‌టీయూహెచ్ అధికారులతో మాట్లాడారు. నవంబరు 1 లేదా 2 నుంచి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఆదేశించారు. నవంబరు 2 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఓయూ అకడమిక్ క్యాలెండర్ రూపొందించినట్లు లింబాద్రి తెలిపారు. జేఎన్‌టీయూహెచ్ సైతం ఒకటి, రెండ్రోజుల్లో అకడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తుందన్నారు.
కళాశాలల్లో చేరేందుకు 28 తుది గడువు..
చివరి విడతలో సీట్లు పొందిన విద్యార్థులతోపాటు గత రెండు విడతల్లో సీట్లు పొందిన వారు కూడా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఒరిజినల్ టీసీతోపాటు ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి జిరాక్స్ కాపీలు అందజేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ సమయంలోనే ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. అయితే ఏఐసీటీఈ ఆదేశాల మేరకు వారం నుంచి రెండు వారాల పాటు విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తరగతులను ప్రారంభించాలి. ఎంసెట్ మూడు విడతల సీట్ల కేటాయింపు ముగిసినా ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ ప్రవేశాలు పూర్తికావాల్సి ఉంది. వాటికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది.
యాజమాన్య కోటా భర్తీకి గడువు పెంపు...
యాజమాన్య కోటా(బీ కేటగిరీ) కింద బీటెక్ సీట్లను భర్తీ చేసుకునేందుకు గడువును నవంబరు 5 వరకు పొడిగించారు. అక్టోబరు 25 వరకు ఉన్న ఈ గడువును మరో 10 రోజులు పెంచుతూ ఉన్నతవిద్యామండలి నిర్ణయం తీసుకుంది. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబరు 26 లేదా 27 తేదీల్లో ఎంసెట్ ప్రవేశాల వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
బ్రాంచీల వారీగా సీట్ల భర్తీ చూస్తే..
➥ సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీల్లో మొత్తం 49,031 సీట్లుంటే 45,775 (93 %) భర్తీ అయ్యాయి. 3,256 సీట్లు భర్తీ కాలేదు. అత్యధికంగా సీఎస్‌ఈ (ఏఐ & ఎంఎల్)లో 1002 సీట్లు మిగిలిపోయాయి. ఇక సీఎస్ఈలో 704 సీట్లు మిగిలాయి.
➥ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో 18,825 సీట్లకు గాను 14,265 సీట్లు (76 %) భర్తీ అయ్యాయి. 4,560 సీట్లు మిగిలిపోయాయి.
➥ ఇక సివిల్, మెకానిక్, సంబంధిత బ్రాంచీల్లో మొత్తం 10,286 సీట్లలో 3,328 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 6,958 సీట్లు (68 శాతం) మిగిలిపోయాయి.
మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగులు..
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబరు 25తో పూర్తయింది. కన్వీనర్ కోటాలో 79,346 బీటెక్ సీట్లకుగాను 63,899 మంది సీట్లు పొందారు. సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందినవారిలో కళాశాలతో చేరే వారి సంఖ్య 55 వేలకు మించదని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆ ప్రకారం చూస్తే కన్వీనర్ కోటాలోనే దాదాపు 24 వేల బీటెక్ సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది.
సీట్ల కేటాయింపు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ
డిగ్రీ విద్యార్థులకు అలర్ట్, యూనివర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్! షెడ్యూలు ఇదే!
తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించిన కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అక్టోబరు 26న విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్లయింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్, పీజీలోని 1, 3 సెమిస్టర్లకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు.
డిగ్రీ, పీజీ అకడమిక్ క్యాలెండర్ వివరాల కోసం క్లిక్ చేయండి..
AISSEE-2023: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
నోటిఫికేషన్, దరఖాస్తు, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..