SKILL UNIVERSITY: 'స్కిల్ యూనివర్సిటీ'గా మారనున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని 'స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ'ను 'స్కిల్ యూనివర్సిటీ'గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
Swamy Ramananda Tirtha Skill University: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని 'స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ'ను 'స్కిల్ యూనివర్సిటీ'గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకుగాను 9 ఉమ్మడి జిల్లాలతో పాటు కొడంగల్‌లోనూ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను స్కిల్ యూనివర్సిటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా ఏర్పాటుకానున్న ఈ స్కిల్ యూనివర్సిటీల్లో ఉపాధి ఆధారిత స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ యోచిస్తోంది. దీనికోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధ్యయనానికి ఆదేశాలు జారీ చేసింది. నైపుణ్య విశ్వవిద్యాలయాలపై అధ్యయనంలో భాగంగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థపై కమిటీలో చర్చ జరిగింది.
ఇప్పటివరకు 5 లక్షల మందికి ఉపాధి శిక్షణ..
అప్పటి ప్రభుత్వం 1986లో జాతీయ విద్యావిధానం కింద 'రామానంద తీర్థ గ్రామీణ సంస్థ'ను మంజూరు చేయగా.. భూదానోద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన పోచంపల్లి వద్ద ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామనంద తీర్థ పేరిట 1995లో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ఈ సంస్థను ప్రారంభించారు. గ్రామీణ యువతకు మార్గనిర్దేశం, పరిశోధనలకు ప్రోత్సాహం, సూక్ష్మ ప్రణాళికలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వృత్తులను సమున్నతంగా తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. విశ్వవిద్యాలయ హోదాతో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ప్రధాన కేంద్రమైన పోచంపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 50 కేంద్రాల్లో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డీటీపీ, అకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్, సౌర విద్యుత్, టైలరింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర 15 రకాల కోర్సులపై వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థ 7వ తరగతి నుంచి డిగ్రీ చదివిన 5 లక్షల మందికి ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చింది. వారి ద్వారా మరికొన్ని లక్షల మంది శిక్షణ పొందారు. వారిలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగాలూ సాధించారు.
కేంద్రం చేయూత..
దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమానికి ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఇక్కడ కోర్సుల నిర్వహణకు నిధులు ఇస్తోంది. సంస్థ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3.7 కోట్లు ఇస్తోంది. ఇక్కడి కోర్సులకు జాతీయ వృత్తివిద్యా శిక్షణ కోర్సుల మండలి(ఎన్‌సీవీటి) గుర్తింపు ఉంది. వంద ఎకరాల విస్తీర్ణంలో లక్షా 75 వేల చదరపు అడుగుల్లో ప్రధాన భవనంతో ఏడు వర్క్‌షాప్‌లు, నాలుగు కంప్యూటర్ ల్యాబ్‌లు, 350 మందికి సరిపడా మూడు వసతిగృహాలున్నాయి.
పలు రాష్ట్రాల అధ్యయనం..
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ శిక్షణ కార్యకలాపాలపై ఇప్పటికే గుజరాత్ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వ బృందాలు అధ్యయనం చేశాయి. కేరళలో ఈ సంస్థ తరహా శిక్షణ విధానం అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నైపుణ్య విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని అర్హతలు, సౌకర్యాలు ఈ సంస్థకు ఉన్నాయని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంస్థలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశించింది.