Time Management: ఈ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటే, అన్ని పనులు సకాలంలో చక్కబెట్టుకోవచ్చు
Time Management: ఈ బిజీ లైఫ్ లో అన్ని పనులు చక్కబెట్టుకోవాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Time Management: అంబానీకైనా, అదానీకైనా.. పీఎంకైనా, సీఎంకైనా రోజులో ఉండే 24 గంటలే. మీకు, నాకు కూడా రోజుకు 24 గంటలే ఉంటాయి. ఇప్పుడు అందరివీ బిజీ లైఫ్‌లే. ఒక పని కాకపోతే మరొకటి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చేయాల్సిన పనులు, నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎక్కువ, ఉన్న టైమ్ తక్కువ. ప్రతి దానికి సమయం కేటాయించాల్సిందే. ప్రతి పనిని శ్రద్ధతో చేయాల్సిందే. పనికి ఎంత సమయం కేటాయిస్తామో.. కుటుంబానికి కూడా అంతే సమయం ఇవ్వాలి. కుటుంబాన్ని వదిలేసి మొత్తం పనిలోనే బిజీ అయిపోవద్దు. అలాగే, పనిని వదిలేసి కుటుంబానికే పూర్తి సమయం కేటాయించవద్దు. ఏ పనికి, ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో కచ్చితంగా అంతే ఇచ్చితీరాలి. లేకపోతే కెరీర్ లో గ్రోత్ ఉండదు, సంబంధంలో సాన్నిహిత్యం ఉండదు. బిజీ బిజీగా, ఉన్న కాస్తంత సమయాన్ని దేనికి కేటాయించాలో తెలియక చాలా మంది ఒత్తిడికి గురవుతారు. ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి తప్పకుండా ఉండాల్సిన స్కిల్ టైమ్ మేనేజ్‌మెంట్. ఉన్న సమయాన్ని ఎలా, ఎంత ప్రభావవంతంగా వాడుకుంటామో తెలిసి ఉండటమే ఈ స్కిల్.
పనులకు ప్రాధాన్యత
చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అయితే అందులో కొన్ని పెద్దగా ప్రాధాన్యత లేనివి ఉండొచ్చు. మరికొన్ని అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండొచ్చు. అందుకే పనులను వాటి ప్రాధాన్యతలను బట్టి విభజించుకుని వాటికి సమయం కేటాయించుకోవాలి.
క్యాలెండర్ వాడుకోవాలి
ఏ పనిని ఎప్పుడు పూర్తి చేయాలో క్యాలెండర్ లో రాసి పెట్టుకోవాలి. ప్రాధాన్యతలను సెట్ చేసుకున్న తర్వాత ఆయా పనులను ఎప్పటి లోపు పూర్తి చేయాలనేది షెడ్యూల్ చేసుకుంటే ఒత్తిడి లేకుండా శ్రద్ధగా పనులు చేసుకోవచ్చు.
చిన్న చిన్న పనులుగా విభజించుకోవాలి
ఒకే రోజులో సబ్జెక్టు మొత్తాన్ని పూర్తిగా చదివేయాలంటే సాధ్యం కాదు. 100 కిలోల బియ్యం బస్తాను మోయడం కంటే దానిని పది పది కిలోలుగా విభజించి మోసుకెళ్లడం చాలా సులభం. అందుకే పెద్ద పెద్ద పనులను చిన్న వాటిగా విభజించుకుని ఒక్కో దానిని పూర్తి చేసుకుంటూ పోవాలి.
విరామం తీసుకోవాలి
చేయాల్సిన పనులు బోలేడు ఉండొచ్చు. చదవాల్సిన సబ్జెక్టు కూజా కొండంత ఉండొచ్చు. అలా అదే పనిగా చదువుతూ పోయినా, ఒకే పనిని చేస్తూ పోయినా కొంత సేపటికి బోర్ కొట్టేస్తుంది, క్రమంగా శ్రద్ధ తగ్గిపోతుంది. అందుకే మధ్యమధ్యలో తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాలి.
రియలిస్టిక్ గోల్స్
జీవితంలో లక్ష్యాలు ఉండాలి. లేకపోతే ఎందుకు కష్టపడుతున్నామో కూడా తెలియకుండా పోతుంది. అలాగే ఆ లక్ష్యాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
Also Read: Communication Skills: కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచడానికి ఈ 10 చిట్కాలు పాటించండి
మల్టీటాస్కింగ్ వద్దు
ఒకేసారి ఒకటికి మించి పనులు చేయడం వల్ల నాణ్యత తగ్గుతుంది. ఒకేసారి అన్ని పనులపై శ్రద్ధ పెట్టలేం. దీని వల్ల ఏదీ పరిపూర్ణంగా పూర్తవదు.
పరధ్యానం పనికి రాదు
టైమ్ మేనేజ్‌మెంట్ లో ఇది చాలా కీలకం. ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తి శ్రద్ధ దానిపై పెట్టాలి. పరధ్యానం వల్ల పనులు త్వరగా పూర్తవవు, అలాగే సమయం కూడా వృథా అవుతుంది.
'నో' చెప్పడం నేర్చుకోవాలి
కొన్నిసార్లు ఎవరైనా దేనిగురించైనా అడిగితే మీకు నచ్చకపోయినా, చేయాలనిపించకపోయినా మొహమాటం కొద్దీ, అన్యమనస్కంగానే ఓకే అనేస్తుంటాం. దాని వల్ల తర్వాత ఇబ్బందిపడిపోతాం. అందుకే 'నో' చెప్పడం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial