Asifabad News: నీట్ యూజీ పరీక్షలో గందరగోళం - సెలెక్ట్ చేసిన పేపర్ బదులు వేరే పేపర్, ఆసిఫాబాద్ లో ఘటన
Telangana News: దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా జరగ్గా.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం గందరగోళం నెలకొంది. సెలక్ట్ చేసిన పేపర్ బదులుగా వేరే పేపర్ ఇచ్చారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
Confusion In NEET UG Exam In Asifabad Exam Center: వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ - 2024 (NEET UG Exam - 2024) ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అయితే, రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కేంద్రంలో ఓ సెంటర్ లో నీట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే.. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ సెంటర్ లో ఇచ్చిన పేపర్ మరొకటని విద్యార్థులు చెబుతున్నారు. ఈ సెంటర్ లో 323 మంది విద్యార్థులకు గానూ 299 మంది విద్యార్థులు ఆదివారం పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఒక సెట్ బదులు మరో సెట్ పేపర్ ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారు.
'వేరే పేపర్ ఇచ్చారు'
ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావలసిన పేపర్ బదులు కెనరా బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్ పేపర్ విద్యార్థులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. దేశవ్యాప్తంగా 'Gridu' అనే పేపర్ ఇస్తే ఇక్కడ 'Nagnu' అనే పేపర్ ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పరీక్ష ముగియగా.. అనంతరం పేపర్ చెక్ చేసుకున్న విద్యార్థులు కంగుతిన్నారు. పరీక్షపై యూట్యూబ్ లో అనాలిసిస్ వీడియో చూడడంతో వీళ్లు రాసిన పేపర్ లోని ఒక్క ప్రశ్న కూడా మ్యాచ్ కాలేదు. అనుమానంతో వేరే సెంటర్ లో రాసిన విద్యార్థుల పేపర్ తో పోల్చి చూస్తే పేపర్ మారినట్లు గుర్తించారు. అయితే, సమాచారం లోపంతో ప్రశ్నపత్రం మారిందని కోఆర్డీనేటర్ చెప్పారు. దీనిపై పై అధికారులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు. అయితే, ఈ విషయంపై విద్యార్థులు ఆసిఫాబాద్ కలెక్టర్ ను కలవనున్నారు. మరోవైపు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ అంశంపై స్పందించి.. ఈ సెంటర్ లో ఎగ్జామ్ రాసిన తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
లీకేజీ వార్తలపై ఎన్టీఏ క్లారిటీ
మరోవైపు, దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టత ఇచ్చింది. విద్యార్థులకు నీట్ యూజీ ప్రశ్నపత్రాలను తప్పుగా ఇచ్చినట్లు పొరపాటు అంగీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రం లీకేజీ వార్తలను మాత్రం ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాదోపూర్, మ్యాన్‌టౌన్‌లోని ఆదర్శ్ విద్యా మందిర్(బాలికల హయ్యర్ సెకండరీ) పరీక్ష కేంద్రంలో హిందీ మీడియానికి బదులుగా ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రాలను పొరపాటుగా ఇచ్చారని, ఇన్విజిలేటర్ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నాడని.. అయినా కూడా విద్యార్థులు ప్రశ్నపత్రంతో పరీక్ష హాలు నుంచి బలవంతంగా బయటకు వచ్చినట్లు ఎన్టీఏ తెలిపింది. నిబంధనల ప్రకారం పరీక్ష సమయం ముగిసే వరకు ప్రశ్నపత్రాలతో బయటకు రావడం విరుద్ధం. అయితే ఆ విద్యార్థులు బలవంతంగా తమకిచ్చిన ప్రశ్నపత్రాలతో బయటకు వెళ్లారు. ఆ క్వశ్చన్ పేపర్‌ను సాయంత్రం 4 గంటలకు ఇంటర్నెట్‌లో పెట్టారని ఎన్టీఏ పేర్కొంది. అప్పటికే దేశంలోని ఇతర పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రారంభం కావడంతో నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీకి ఆస్కారం లేదంటూ ఎన్టీఏ స్పష్టం చేసింది.
Also Read: Bhatti Vikramarka: పదేళ్లలో కృష్ణానది నుంచి పాలమూరుకు అదనంగా చుక్క నీరు రాలేదు: భట్టి విక్రమార్క