Bhatti Vikramarka: పదేళ్లలో కృష్ణానది నుంచి పాలమూరుకు అదనంగా చుక్క నీరు రాలేదు: భట్టి విక్రమార్క
Telangana News: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని వనరుల్ని, సంపదను దోచుకుంది కానీ, పాలమూరు జిల్లాకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.
Bhatti Vikramarka Election campaign in Alampur | అలంపూర్: తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ అంటే, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని హస్తం పార్టీ నేతలు అంటూనే ఉంటారు. అయితే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నా పదేళ్లలో కృష్ణానది నుంచి పాలమూరుకు అదనంగా ఒక చుక్క నీరు కూడా రాలేదని బీఆర్ఎస్ పాలనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విమర్శలు గుప్పించారు. గత పది ఏళ్లలో ఈ రాష్ట్ర సంపద, వనరులను బీఅర్ఎస్ దోచుకుందన్నారు. అలంపూర్ లో ఆదివారం కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన జన జాతర సభలో భట్టి విక్రమార్గ పాల్గొని ప్రసంగించారు.
సాగు, తాగునీటి కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గత పది ఏళ్లలో ఇదే పాలమూరు జిల్లాకు కృష్ణా నది నుంచి అదనంగా ఒక చుక్క నీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. జూరాల, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ తోపాటు అనంతరం మొదలుపెట్టిన జూరాల నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం లోనే సాధ్యమయ్యాయి అన్నారు. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఒక చుక్క నీరు రాకుండా అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు.
ఈ దేశ సంపద, వనరులు ఈ ప్రాంతానికే, ఈ దేశ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారని అన్నారు. కాబోయే ప్రధాని, దేశ ప్రజల కోసం ఒంటరిగా నిరంతరం పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అని అభివర్ణించారు. మన ప్రాంత సంపద మనకే చెందాలి. కానీ కానీ నరేంద్ర మోడీ లాగా కొద్దిమంది తన మిత్రులు, క్రోనీ క్యాపిటల్స్ అదానీ, అంబానీలకు ధారా దత్తం చేస్తే ప్రజలు నష్టపోతారని రాహుల్ పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. ఈ దేశ ప్రజల తరపున ఉంటానని, వారి పక్షాన పోరాటం చేస్తానని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.
దేశ స్వతంత్రం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కృషి చేసింది. అదేవిధంగా తన బాధ్యతగా మోదీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడ్డానికి పోరాటం చేస్తామన్నారు. మనందరి కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని భట్టి విక్రమార్క మల్లు కోరారు.