NEET PG: నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్' ఏంటంటే?
నీట్-పీజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో ఎన్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసిన కేంద్రం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది.
వైద్యవిద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం రద్దుచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. నీట్-పీజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT-నెక్ట్స్) నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టానికి సవరణలు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి నెక్ట్స్ 2023 డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. 2019-20 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు 'NExT' రాసే మొదటి బ్యాచ్ కానున్నారు.
నీట్-పీజీ పరీక్ష పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మాత్రమే నిర్వహిస్తుండగా, నెక్ట్స్‌లో మూడు అంశాలను చేర్చారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు నెక్ట్స్ పాసైతే పీజీలో సీటు పొందవచ్చు. ఉన్నత విద్య చదవకపోయినా వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకొనేందుకు కూడా ఈ పరీక్షే లైసెన్సుగా ఉపయోగపడుతుంది. వీటితోపాటు విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు నెక్ట్స్ పాసైతే మనదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకొనేందుకు, పీజీ చేసేందుకు కూడా అనుమతి లభిస్తుంది. విదేశీ విద్యార్థులకు ఇప్పటివరకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.
Also Read: పీజీ డెంటల్ సీట్ల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదల
'నెక్ట్స్' పరీక్ష తెరమీదకు వస్తుండటంతో వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో నిర్వహించనున్న 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG)' పరీక్ష చివరిది కావచ్చు. ఇకపై పీజీ మెడికల్ ప్రవేశాలకు ఎగ్జిట్ టెస్ట్ ఫలితాలపై ఆధారం కానున్నారు. డిసెంబర్ 2023లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) నిర్వహించాలని భావిస్తున్నట్లు నవంబరు 7న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
NMC చట్టం ప్రకారం, NExT అనేది ఒక సాధారణ అర్హత పరీక్ష. MBBS చివరి సంవత్సరం విద్యార్థులు ఉన్నత వైద్యవిద్య అభ్యసించడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో మెరిట్ ఆధారిత ప్రవేశానికి, భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్‌లకు స్క్రీనింగ్ పరీక్షగా, లైసెన్సియేట్ పరీక్షగా నెక్ట్స్ పనిచేస్తుంది.
Also Read: బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, షెడ్యూలు ఇదే!
NExT నిర్వహించడానికి కాల పరిమితిని సెప్టెంబర్ 2024 వరకు పొడిగించాలని ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్‌ను కోరింది. అయితే NMC చట్టం ప్రకారం.. సెప్టెంబర్ 2020 నుండి ఎన్‌ఎంసీ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో పేర్కొన్న ప్రకారం మూడేళ్లలోపు NExT పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది డిసెంబరులో NExT పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది.
మెడికల్ సైన్సెస్‌లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌కు బదులుగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ పరీక్షను నిర్వహించవచ్చని, అయితే ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. NExTని నిర్వహించాలంటే వర్కవుట్ మోడాలిటీస్, సిలబస్, టైప్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ వంటి ప్రిపరేషన్‌లు అవసరమని, విద్యార్థులు దీనికి సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
మెయిన్ పరీక్షకు ముందు మాక్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. NExT యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది భారతదేశంలో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉంటుందని, అందువల్ల ఇది విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థుల లైసెన్స్ సమస్యను పరిష్కరిస్తుందని అధికారులు తెలిపారు.