NEET PG 2023: నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ, ఇక షెడ్యూలు ప్రకారమే పరీక్ష!
ఒకవేళ పరీక్ష వాయిదా వేస్తే.. ఈ సమీప భవిష్యత్తులో పరీక్ష నిర్వహణకు మళ్లీ ప్రత్యామ్నాయ తేదీ కూడా ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణకు నిరాకరించింది.
మార్చి 5న జరగాల్సిన నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2023ని వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. ఈ పరీక్షకు షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 27 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేశామని.. కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 15 నుంచి జరుగుతుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఈ) తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యాభాటి ధర్మాసనానికి వివరించారు. ఒకవేళ పరీక్ష వాయిదా వేస్తే.. ఈ సమీప భవిష్యత్తులో పరీక్ష నిర్వహణకు మళ్లీ ప్రత్యామ్నాయ తేదీ కూడా ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. దీంతో జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణకు నిరాకరించింది.
మార్చి 5న పరీక్షలు నిర్వహిస్తే ప్రిపేర్ అయ్యేందుకు సమయం చాలదని.. అందువల్ల మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నీట్ పీజీ పరీక్ష వాయిదా డిమాండ్‌పై దేశ రాజధాని నగరంలో ఆందోళనలు కూడా చేపట్టారు. నీట్ పీజీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సైతం దిగారు. కటాఫ్ తేదీల విషయంలో విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని పెంచిన విషయం తెలిసిందే.
గత శుక్రవారం విచారణ సమయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఏ) తన వాదనలు వినిపిస్తూ నీట్-పీజీ రాసేందుకు 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. మార్చి 5న జరగాల్సిన ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయలేమని చెప్పింది. అయితే, వాయిదా వేయకపోతే ఎంతమందిపై ప్రభావం పడొచ్చంటూ న్యాయస్థానం ప్రశ్నించగా.. 45వేల మంది అని అధికారులు చెప్పారు. ఈ సమస్యకు ఒక పరిష్కారంతో రావాలని కోరుతూ నేటికి విచారణ వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌బీఈ తరఫు న్యాయవాది చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసింది.
నీట్ పీజీ-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్!
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ-2023 పరీక్ష యథాతదంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది. పరీక్ష వాయిదా వేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా అందుకు కేంద్రం ససేమిరా అంది. తాజాగా సుప్రీం కోర్టులో కూడా నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన అత్యున్నత ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని తీర్పునిచ్చింది. దీంతో పరీక్ష ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరగనుంది. పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదని ఇప్పటికే మెడికల్ బోర్డు కూడా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నీట్ పీజీ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..