Ramayana, Mahabharata Lessons: పాఠశాల చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు - NCERT ప్యానెల్ కీలక సిఫార్సులు
NCERT Books: చరిత్ర పుస్తకాల్లో రామాయణం (Ramayana), మహాభారతం (Mahabharata) వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Ramayana to be included in NCERT textbooks: దేశంలో పాఠశాల విద్యలో పలు మార్పులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యావిధానంలో మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేపడుతూ వస్తోంది. ఇప్పటికే పలు పాఠ్యాంశాలను తొలిగిస్తూ.. కొత్త వాటిని జతపరుస్తూ వస్తోంది. అయితే తాజాగా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో ఎన్‌సీఈఆర్టీ కమిటీ (NCERT Panel) కీలక సిఫార్సులు చేసింది.
చరిత్ర పుస్తకాల్లో రామాయణం (Ramayana), మహాభారతం (Mahabharata) వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సూచించినట్లు జాతీయ మీడియాలు కథనాలు వెలువడ్డాయి.
సాంఘిక శాస్త్రానికి (Social Sciences) సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాఠ్యాంశాల్లో చరిత్రను మూడు భాగాలుగా (ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా) విభజించారు. అయితే.. దీన్ని నాలుగు భాగాలుగా విభజించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది.
క్లాసిక్ పీరియడ్ (సంప్రదాయ చరిత్ర), మధ్య యుగం, బ్రిటిష్ కాలం, ఆధునిక భారతం.. ఇలా నాలుగు భాగాలుగా వర్గీకరించాలని సూచించింది. క్లాసిక్ పీరియడ్‌లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలి. రామాయణానికి సంబంధించి రాముడు, ఆయన ఉద్దేశాలను విద్యార్థులు పూర్తిగా తెలుసుకోవాలి. ఇతిహాసాల గురించి విద్యార్థులు కొంతవరకైనా తెలుసుకోగలగాలని కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ వెల్లడించారు.
చరిత్ర పుస్తకాల్లో భారతదేశాన్ని పాలించిన రాజులు, వారి పాలనకు మరింత ఎక్కువగా స్థానం కల్పించాలని కమిటీ సిఫార్సు చేసింది. సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి పాఠాలను చేర్చాలని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాయాలని ప్రతిపాదించింది.
ఇటీవలే పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' బదులు 'భారత్' పేరును ఉపయోగించాలని ఇటీవల ఈ కమిటీ సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే. భారత్ అనే పేరు 7 వేల ఏళ్ల పురాతనమైన విష్ణు పురాణంలో ఉపయోగించారని, అందుకే దేశాన్ని ఆ పేరుతో సంబోధించాలని సూచించినట్లు ఐసాక్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చరిత్ర పాఠ్యాంశాల్లో కమిటీ సిఫార్సుల గురించి మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, కమిటీ సిఫారసుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేష్ సక్లానీ తెలిపారు.
ALSO READ:
ఉస్మానియా యూనివర్సిటీలో 'సివిల్స్' ఉచిత శిక్షణకు నోటిఫికేషన్, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Civil Services Prelims) పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ (Free Training) కోసం ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా ఓయూలోని 'సివిల్ సర్వీస్ అకాడమీ' (Civil Service Academy) ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 2 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓయూ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువపత్రాల నకళ్లను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 8331041332 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
నోటిఫికేషన్, సివిల్ ఉచిత శిక్షణ వివరాల కోసం క్లిక్ చేయండి..