CSIR UGC NET: సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ జూన్-2024 పరీక్ష వాయిదా, త్వరలో కొత్త తేదీ వెల్లడి
CSIR-UGC-NET June 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జూన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదావేసింది. అనివార్య కారణాల వల్ల పరీక్ష వాయిదా వేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది.
➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.
➥ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఇటీవలే యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ పరీక్ష రద్దు..
దేశవ్యాప్తంగా జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్షను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష జరిగిన మరుసటి రోజే అంటే జూన్ 19న యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం రావడంతో.. పారదర్శకతను కాపాడటం కోసం పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. మళ్లీ యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నీట్ 2024 పరీక్ష సహా పలు పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్రం ఈ తరహా నిర్ణయం తీసుకుంది.
యూజీసీ నెట్ పరీక్ష లీకేజీ గురింది కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు పరీక్షను రద్దు చేశారు. పరీక్ష పారదర్శకత, సమగ్రతపై రాజీపడకుండా ఉండేందుకు నెట్‌ను రద్దు చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించింది.