Break Study In JNTU: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బీటెక్‌లో బ్రేక్ స్టడీ.. జేఎన్‌టీయూ కీలక నిర్ణయం..
JNTU: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఏడాది పాటు చదువును మధ్యలో ఆపేసి.. మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) విద్యార్థుల కోసం మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బీటెక్ మధ్యలో ఏడాది పాటు చదువును ఆపేసి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ విధానాన్ని జేఎన్‌టీయూ తీసుకువచ్చింది. స్టార్టప్స్ లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ అవకాశం కల్పించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనున్నట్లు జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వెల్లడించారు.
బీటెక్‌లో చేరితే నాలుగేళ్ల పాటు వరుసగా చదవాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్ల పాటు తాత్కాలిక విరామం తీసుకునే సౌకర్యాన్ని కల్పించింది. బీటెక్ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్ కంపెనీలతో దూసుకుపోతున్నారు. సరికొత్త టెక్నాలజీతో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు చదువు కొనసాగించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్టార్టప్‌కు ప్రాధాన్యత ఇస్తే.. చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వస్తోంది. మరికొంత మంది అనారోగ్య కారణాల వల్ల చదువుకు బ్రేక్ పెడుతుంటారు.
Also Read: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీలో సవరణలకు అవకాశం.. ఇవి చేయకపోతే ఫలితాలు కూడా రావు
విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్‌టీయూ బ్రేక్ స్టడీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల స్టార్టప్ పెట్టిన విద్యార్థులు అటు కంపెనీని.. ఇటు చదువును కొనసాగించే అవకాశం ఉంటుంది. బ్రేక్ స్టడీ విధానానికి కొన్ని మార్గదర్శకాలు (గైడ్ లైన్స్) పాటించాలని జేఎన్‌టీయూ పేర్కొంది. అవి ఇలా ఉన్నాయి.
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
జేఎన్‌టీయూ గైడ్ లైన్స్ ఇవే..
1. స్టార్టప్స్ వెంచర్లు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నవారు మాత్రమే బ్రేక్ స్టడీకి అర్హులు.
2. తొలి 4 సెమిస్టర్లు పూర్తి చేసిన వారికే అవకాశం ఇస్తామని తెలిపింది. బ్యాక్ ల్యాగ్స్ ఉన్న వారికి, హాజరు శాతం లేని వారికి ఈ ఛాన్స్ ఉండదు.
3. ఆయా విద్యార్థులు జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌కు రిపోర్ట్‌చేసి, అనుమతి పొందాలి. ఏ కారణం వల్ల చదువుకు బ్రేక్ కావాలనే వివరాలను వెల్లడించాలి.
4. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అనుమతి పొందాలని తెలిపింది.
5. ఏడాది పూర్తి అయిన వెంటనే మళ్లీ తిరిగి కోర్సులో చేరాలి.