JEE Main 2023 సెషన్-1 ఫలితాలు, ఫైనల్ 'కీ' విడుదల, డైరెక్డ్ లింక్ ఇదే!
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్– 2023 ఫస్ట్ సెషన్ పేపర్–1 ఫలితాలు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్– 2023 ఫస్ట్ సెషన్ పేపర్–1 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1(బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2(బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఫస్ట్ సెషన్ పరీక్ష ఫలితాలు విడుదలచేశారు. జేఈఈ ఫస్ట్ సెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేసింది. ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. వీటిని నిపుణులతో విశ్లేషించి ఫైనల్ ఆన్సర్‌కీని, మార్కులు, స్కోర్ పాయింట్లు, టాపర్ల పేర్లతో ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
పరీక్ష ఫలితాలు తెలుసుకోండి ఇలా..
➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.- https://jeemain.nta.nic.in
➥ అక్కడ హోంపేజీలో జేఈఈ మెయిన్ సెషన్-1(2023) ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ అక్కడ లాగిన్ పేజీలో విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలను నమోదుచేయాలి.
➥ వివరాలు సమర్పించిన తర్వాత జేఈఈ మెయిన్ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➥ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
JEE MAIN (2023): Paper 1 – B.E. / B.Tech Results
JEE MAIN (2023): FINAL ANSWER KEYS Paper 1 – B.E. / B.Tech
ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు
ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేయనుంది.
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షల కోసం దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే, పేపర్-1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22 లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6లక్షల మందికి పైగా అమ్మాయిలు; 6లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్-2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్షను 46వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25వేల మంది అబ్బాయిలు; 21వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే.
Also Read:
బిట్‌శాట్- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ ప్రకటన, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీల వివరాల కోసం క్లిక్ చేయండి..