(Source: ECI/ABP News/ABP Majha)
Inter Education: ఏపీలో 210 హైస్కూల్స్‌లో ఇంటర్ విద్య, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఏపీలో 210 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటిల్లో 207 కో-ఎడ్యుకేషన్, బాలికలకు ప్రత్యేకంగా మూడు హైస్కూల్ ప్లస్‌ల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రానుంది
Upgradation of High Schools: ఏపీలో 210 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటిల్లో 207 కో-ఎడ్యుకేషన్, బాలికలకు ప్రత్యేకంగా మూడు హైస్కూల్ ప్లస్‌ల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి మండలంలో ఒకటి ప్రత్యేకంగా బాలికలకు, మరొకటి కో-ఎడ్యుకేషన్ కోసం ఇంటర్మీడియట్ కోర్సును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు కళాశాలలు లేని మండలాల్లో ఉన్నత పాఠశాలల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం(2024-25) నుంచి ఈ హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్ తరగతులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఏర్పాటుచేసే కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి తరగతిలోనూ 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఉండాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటుకానున్నాయి. వీటిల్లో ఒకటి కో-ఎడ్యుకేషన్, మరొకటి బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన 292 హైస్కూల్‌ప్లస్ బాలికల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఘోరంగా ఉన్నాయి. చాలా కళాశాలల్లో అసలు అడ్మిషన్లే లేని పరిస్థితి. అధ్యాపకుల నియామకాలు తగిన స్థాయిలో లేకపోవడంతో 12 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ప్రైవేట్ స్కూళ్లలో 'ఉచిత' ప్రవేశాలకు అవకాశం..
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1) (ఈ) 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1న మొదటి విడత ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ALSO READ:
బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..