ABP Desam SmartEd Conclave 2025: పారిశ్రామికవేత్తలను తయారు చేసేలా పాలసీలు ఉండాలి: ఏబీపీ దేశం కాంక్లెవ్ 2025లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ABP Desam SmartEd Conclave 2025: విద్యార్థి, ఉపాధ్యాయులు ఓ సైనికుడ్ని పోలి ఉండాలి. ప్రభుత్వం పాలసీలు యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ఉండాలన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

ABP Desam SmartEd Conclave 2025: 21వ శతాబ్ధంలో యువతను ఉద్యోగం సంపాదించే వారిగా కాక, వారిని ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు చేసే పాలసీలను ప్రభుత్వాలు రూపొందించాలని తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. ఏబీపీ దేశం నిర్వహించిన స్మార్ట్ ఎడ్యూ కాంక్లేవ్ -2025లో పాల్గొని పాలసీ విత్ పర్పస్ ఎంపవరింగ్ యూత్ విత్ టంట్వీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ అనే అంశంపై మాట్లాడారు.
విద్యారంగంలో మార్పులు తెచ్చే పాలసీలు కావాలి
ప్రస్తుత విద్యారంగంలో నేర్చుకుంటున్న విద్యకు, పరిశ్రమలు, ఐటీతోపాటు ఇతర రంగాల్లో ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌కు మధ్య చాలా గ్యాప్ ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. దీన్ని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం కార్పోరెట్ వరల్డ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తమ అవసరాలకు తగిన స్కిల్డ్ యువత దొరకకపోవడమే అన్నారు. కార్పోరేట్ స్థాయిలో మెయిల్ రాయడం, ఫోన్లకు తగిన రీతిలో మాట్లాడే కమ్యూనికేష్ స్కిల్క్స్ వంటివి కూడా కార్పోరేట్ సంస్థలు శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. 20 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో అప్పటి సంస్థలు ఇబ్బంది పడ్డాయని, ఇప్పుడు అదే సమస్యపై చర్చించాల్సి వస్తుందని శ్రవణ్ చెప్పారు. ప్రస్తుత యువతలో కమ్యూనికేషన్ , టీమ్ వర్క్, లీడర్ షిప్ స్కిల్క్ లోపం కనిపిస్తోందన్నారు. ఇది పెద్ద సమస్య కాదని, కాని వారికి సరైన దిశా నిర్దేశం చేయడంలో పాలసీ మేకర్లు, విద్యా సంస్థలు, అధ్యాపకులు విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డారు.
తప్పు విద్యార్థులది కాదు.. ఉపాధ్యాయులు, అధ్యాపకులది కూడా..
ప్రస్తుతం నేటి యువత ఎదుర్కొంటోన్న స్కిల్ లోపాలకు కారణం వారు కాదని టీచర్లదేనని ఎమ్మెల్సీ శ్రవణ్ అన్నారు. ఓ అధ్యయనం ప్రకారం 50 మంది టీచర్లలో కమ్యూనికేష్, డిజిటల్, టెక్నాలజీ స్కిల్స్ లేవని తేలిందన్నారు. విద్యార్థులకు బోధించే విషయంలో ఈ స్కిల్స్ లేని పరిస్థితి ఉందని ఆ సర్వే ద్వారా తెలిసిందన్నారు. టీచర్లలోనే స్కిల్స్ లోపిస్తే వారు విద్యార్థులపై ఏం ప్రభావం చూపుతారని శ్రవణ్ ప్రశ్నించారు. టీచర్లు, విద్యార్థులు స్కిల్ లేని ఒకే నావలో ప్రయాణిస్తున్నట్లు పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను స్కిల్డ్ పర్సన్ గా తీర్చిదిద్దే ముందు పాలసీ మేకర్లు, విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులను, ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. చైనా లాంటి దేశాల్లో మాండరిన్ భాషలో 150 పదాలు నేర్చుకుంటే తప్ప అక్షరాస్యుడిగా గుర్తించరని, కాని మన దేశంలో సొంత భాషలో పేరు రాయడం వస్తే వారిని అక్షరాస్యుడిగా గుర్తించే విధానం ఉందని శ్రవణ్ చెప్పారు. ఇలాంటి విధానాలు దేశానికి మేలు చేయవన్నారు. చైనా బడ్జెట్‌లో 4 శాతం విద్య కోసం ఖర్చు చేస్తే, మన దేశం 2.9 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇలాంటి విధానాల వల్లే మన దేశం టెక్నాలజీ, ఐటీ పరంగా ముందున్నా అక్షరాస్యత 70 శాతం మాత్రమే ఉందని, చైనాలో అది 90 శాతంగా ఉందని చెప్పారు. విద్యా పాలసీ తయారు చేసే వారు కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకోకుండా టీచర్లను కూడా ట్రైన్ చేసేలా పాలసీలు తయారు చేయాలని సూచించారు.
విద్యార్థి, ఉపాధ్యాయుడు ఓ సైనికుడిలా ఉండాలి.
విద్యను బోధించే విషయంలో గాని, విద్యార్థులు విద్యను ఆర్థింజే విషయంలో ఓ సైనికుడిని పోలి ఉండాలని శ్రవణ్ ఉదహరించారు. ఓ సైనికుడికి తన జీవితంలో ఒక్కసారే యుద్దం చేసే అవకాశం రావచ్చు. కాని ఆ సైనికుడు ప్రతీ రోజు యుద్దం వస్తుందన్న రీతిలో సన్నద్ధతతో ఉంటారని చెప్పారు. అందుకు అవసరమైన శిక్షణ ఆ సైనికుడికి ప్రతీ రోజు ఉంటుందన్నారు. అలాగే విద్యార్థి, టీచర్లు కూడా ప్రతీ రోజు టెక్నాలజీ పరంగాను, స్కిల్స్ పెంచుకునే విషయంలో సైనికుడి వల్లే సన్నద్ధత, శిక్షణ కలిగి ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తు ఇది మన దేశంలో జరగడం లేదన్నారు. ప్రస్తుత యువత టెక్నాలజీని అర్థం చేసుకునే శక్తి ఉంది. వారికి మార్గనిర్దేశనం చేసే టీచర్ల వ్యవస్థ కావాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లీడర్ షిప్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ నేర్పేరీతిలో ప్రభుత్వ పాలసీలు ఉండాలని సూచించారు.
స్కిల్ యూనివర్సిటీ ఉద్యోగులను తయారు చేసే కర్మాగారం కాకూడదు.
తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న స్కిల్ యూనివర్సిటీ అనేది కేవలం నైపుణ్యం గర ఉద్యోగులను తయారు చేసేదిగా ఉండకూడదన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని అప్పుడు హైకమాండ్ ఆదేశాలతో నిపుణులైన వారితో కలిసి కాంగ్రెస్ మ్యానిెఫెస్టో పాలసీలు తయారు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణకు స్కిల్ యూనివర్సిటీ ఉండాలని తామంతా భావించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టినట్లు చెప్పారు. గతంలో వైఎస్ హయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టారని, బీఆర్ఎస్ హయంలో టాస్క్ పేరుతో ఉందని, ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీగా మార్చిందన్నారు. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏం చేయదల్చుకున్నారని శ్రవణ్ ప్రశ్నించారు. నైపుణ్యం గల ఉద్యోగులను తయారు చేయడానికి ఇది అవసరం లేదన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచం నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం చూడటం లేదని, నైపుణ్యం ఉన్న పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, ఉద్యోగాలు కల్పించే వారి కోసం ఎదురు చూస్తోందన్నారు. ఉద్యోగాలు కోరే వారి అవసరం లేదని, ఉద్యోగాలు ఇచ్చే వారిని తయారు చేయాల్సి ఉందన్నారు. స్కిల్ యూనివర్సిటీ నైపుణ్య లోపాలు, నైపుణ్యం ఉన్న యువత కొరత, కార్పోరేట్ సంస్థలు ఏం కోరుకుంటున్నాయన్న సర్వే నిర్వహించిందా అని శ్రవణ్ ప్రశ్నించారు. అలాంటి వివరాలు లేకుండా స్కిల్ యూనివర్సిటీ ఏం చేయనుందని ప్రశ్నించారు.
ప్రపంచ అవసరాలు తీర్చేలా పాలసీలు ఉండాలి.
మన విద్యావిధానం సమూలంగా మారాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ శ్రవణ్ చెప్పారు. ప్రాధమిక, హైస్కూల్, ఇంటర్, డిగ్రీ స్థాయి నుండే వారి స్కిల్స్ పెంచేలా విద్యా పాలసీలు ఉండాలన్నారు. కేవలం సర్టిఫికెట్స్ కోసం విద్యను బోధిస్తే ఆ విద్యార్థి పోటీ ప్రపంచంలో వెనుకబడటం ఖాయమని చెప్పారు. టెక్నాలజీ పరంగా నేటి యువత అంత వెనుకబడి లేరని కాని కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లీడర్ షిప్ స్కిల్స్ వంటి విషయాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. విద్యా సంస్థలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ లు, పరిశ్రమలు, కార్పోరెట్ సంస్థలు, టెక్నాలజీ సంస్థలన్నింటిని ఓ గొడుగు కిందికి తెచ్చి నైపుణ్య విషయంలో యువతలో ఉన్న లోపాలను కనుక్కునే వ్యవస్థ లేదా పాలసీ తేవాలని సూచించారు. ప్రతీ ఆరు నెలలకు టెక్నాలజీ సంస్థలు తమ టెక్నాలజీని మార్చేస్తున్నాయని, కాని అధ్యాపకులు వాటిని అందిపుచ్చుకుని విద్యార్థులకు శిక్షణ ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. విద్యా సంస్థల క్యరికులం కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ సిలబస్ ను మార్చుకునే పాలసీలు రావాలని ఆకాంక్షించారు.
టెక్నాలజీ మార్పుల వల్ల కొత్త అవకాశాలు
ఏఐ, రోబోట్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలా మంది భయపడుతున్నారని ఇది సరి కాదని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్న సమయంలో ఆయన మన ప్రభుత్వ రంగ సంస్థల్లో కంప్యూటర్లను ప్రవేశపెట్టారని, అప్పుడు కార్మిక, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాయని చెప్పారు. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. కాని తర్వాతి తరం ఆ కంప్యూటర్లను నేర్చుకోవడం వల్ల ఇవాళ ఐటీ రంగంలో మన దేశం ముందు ఉందన్నారు. ప్రతీ విద్యార్థి, టీచర్ టెక్నాలజీని వేగంగా నేర్చుకోవాలన్నారు. బీకాం విద్యార్థి టాలీ నేర్చుకపోతే తన డిగ్రీతో ఉద్యోగం సంపాదించగలడా అని ప్రశ్నించారు. డిగ్రీ ఏదైనా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఏఐ, చాట్ జీపీటీ, వంటి వాటిని ఉపయోగించాలని సూచించారు. రానున్న రోజుల్లో క్లాస్ రూంల తీరు మారిపోతాయన్నారు. టీచర్ల బదులు రోబోలు బోధించవచ్చని చెప్పారు. చాట్ జీపీటీ వంటి వాటితో అవసరమైన సమాచారం మనమే నేరుగా తెలుసుకోవచ్చన్నారు. అప్పుడు టీచర్లు కేవలం మెంటార్స్ గా, పరిశీలకులుగా మాత్రమే ఉండవచ్చన్నారు. క్లాస్ రూంలు కూడా అంతర్థానం కావచ్చని, జూమ్, గూగుల్ మీట్ వంటి ద్వారా కూడా ఆన్ లైన్ క్లాస్ లు జరగవచ్చన్నారు. క్లాస్ రూంలు చర్చించుకునే ఫోరంలుగా రూపాంతరం చెందవచ్చని శ్రవణ్ చెప్పారు. చేసే పనిలో టెక్నాలజీని వినియోగించుకునే నైపుణ్యం సంపాదిస్తే ఉద్యోగాలు పోయే అవకాశం లేదని, కొత్త అవకాశాలు లభిస్తాయని శ్రవణ్ చెప్పారు.






















