ABP Smart Ed Conclave : AI ని సునామీలా చూడొద్దు.. ఉపాధ్యాయుడి స్థానానికి AIతో ముప్పులేదన్న రూట్స్ కొలీజియం ఛైర్మన్ బీపీ పడాల
BP Padala : పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని బోధనలు సాగాలని ఉపాధ్యాయులకు రూట్స్ కొలీజియం ఛైర్మన్ బీపీ పడాల సూచించారు. ఏబీపీ నిర్వహించిన ఎడ్యూ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు.

BP Padala Chairman of Roots Collegium: టెక్నికల్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా గురువుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు రూట్స్ కొలీజియం ఛైర్మన్ బీపీ పడాల. ఏబీపీ దేశం నిర్వహించిన స్మార్ట్ ఎడ్యూ కాన్‌క్లేవ్‌లో అతిథిగా హాజరై మాట్లాడారు. యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. AIపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. కృత్రిమ మేధస్సు తరగతి గదిని ఎలా మారుస్తుందనే అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. విద్య అనేది విద్యార్థి- ఉపాధ్యాయ సంబంధం, మార్గదర్శకత్వం, నిజాయితీ, బాధ్యత వంటి విలువలతో కూడినదని తెలిపారు. అయితే టెక్ దిగ్గజాల్లో తాను ఓ భిన్నమైన వ్యక్తిగా తనను తాను చెప్పుకొచ్చారు. సంప్రదాయ డొమైన్ నుంచి వచ్చిన వ్యక్తిగా తాను ఉపాధ్యాయుడి పక్షపాతిగానే ఉంటానన్నారు. ఇప్పుడు ఓవైపు రోజురోజుకు మరింత శక్తిమంతగా మారుతున్న టెక్నాలజీ, మరోవైపు సంప్రదాయ విధానాలు కలిపే జంక్షన్‌లో ఉన్నామని.. ఇలాంటి సమయంలో ఈ చర్చ అవసరం ఉందని పేర్కొన్నారు.
మార్గదర్శకత్వం, విలువలపై ఏఐ ప్రభావం
ఉపాధ్యాయుడి సంరక్షణ, సహ అభ్యాసనం, మనిషి విలువలు చెప్పే సంప్రదాయ తరగతి గదిపై ఇప్పుడు AI రాకతో ప్రభావం పడుతుందనే విషయంతో బీపీ పడాల విభేదించారు. చాట్‌జీపీటీ, జెమినీ వంటి టూల్స్ ఎలాంటి ఆలోచన లేకుండా అడిగినదానికి సమాధానాలు అందిస్తాయి. సమాచారాన్ని సేకరిస్తాయి. కానీ వీటన్నింటి కంటే విద్యార్థికి ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం అందిస్తాడు. కరుణ, హ్యూమానిటీతో సలహాలు ఇస్తాడు. మానవ విలువలు నేర్పిస్తాడు. ఇవన్నీ ఈ ఏఐలో లోపిస్తాయి. ఏఐ వల్ల నైతికత లోపిస్తుందా అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం అన్నారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లు కచ్చితంగా ఎలాంటి మార్పులు వస్తాయో తెలుస్తాయన్నారు. ఏఐ వల్ల మానవ విలువలు దెబ్బతింటాయనే వాదనను తోసిపుచ్చారు బీపీ పడాల . ఏఐ అనేది ఒక సాంకేతిక టూల్ మాత్రమే ...దీని వల్లే మానవ విలువలు, సంప్రదాయ విద్యాబోధనపై ప్రభావం పడబోదన్నారు. వాటిని ఎంత వరకు ప్రభావితం చేస్తుంది, కొత్త సమన్వయం చేస్తుందా అనేది చూడాలని అన్నారు. ఎప్పటికీ సంప్రదాయ ఉపాధ్యాయుడి స్థానాన్ని AI భర్తీ చేయబోదు అన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టం చేశారు
డిజిటల్ యుగంలో మానవ స్పర్శకు స్థానం లేదు
విద్యాసంస్థల్లో మార్పులు చాలా వచ్చాయి. డిజిటల్ క్లాస్‌రూమ్‌ల్లో పాఠాలు వింటున్నారు. ఇలాంటి సమయంలో విద్యాసంస్థలు పాత్ర ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా బీపీ పడాల కరోనా సమయంలో ఉన్న పరిస్థితులు గుర్తు చేశారు. కరోనా సోకిన మొదట్లో ఆన్‌లైన్ క్లాస్‌లు అంటే చాలా మంది కాస్త జాలీగా చూశారు. తర్వాత సీరియస్‌నెస్ పెరిగింది. ఆ తర్వాత విసుగు వచ్చింది. అప్పుడు నిజమైన తరగతి గదిని మిస్ అవుతున్నామనే భావన మొదలైంది. ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతున్నప్పటికీ తరగతి గదిలో కూర్చొని వినే ఫీల్ కోల్పోయారు. విద్యార్థులతో కలిసి నేర్చుకోవడం లేదనే భావన మొదలైంది. మనిషి సంఘ జీవి. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుని అన్ని విషయాలు నేర్చుకోలేడు. పది మందిలో కూర్చుని నేర్చుకునే విషయాలు చాలా కాలం గుర్తు ఉంటాయి. కొత్త అనుభూతిని ఇస్తాయి. ఆ ఫీల్ ఒక్క రియల్ క్లాస్‌రూమ్‌లోనే వస్తుందన్నారు. ఆ ఫీల్ ఈ డిజిటల్ క్లాస్ రూమ్‌లో లభించదని అభిప్రాయపడ్డారు.
AI ఓ టూల్ మాత్రమే
ఏఐ అనేది కేవలం ఓ టూల్ మాత్రమే. దాని ఆధారంగా అధ్యాపకులు తమ బోధన విధానాలు మార్చుకుని పిల్లలకు విద్యను అందించాలి. టెక్నాలజీలో విలువలు, సింపతీ, హ్యుమానిటీని అంతర్భాగం చేయలేం. కాబట్టి అవి కళాశాలలు, అధ్యాపకులు, విద్యాసంస్థలు అందరూ కలిసి మాత్రమే చేయాలి.
AI కి పక్షపాతం
విద్యలో సాధనంగా భావిస్తున్న ఏఐకి కూడా పక్షపాతం ఉంటుందన్నారు బీపీపడాల. ఏఐ అనేది కూడా మానవుడిలానే చాలా బ్యాగేజీని మోస్తుంటుందన్నారు. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారనే అంశంపై అది పని చేసే విధానం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉపయోగించే వాళ్లును బట్టిగా మారుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భాషా శైలిని ఏఐ గుర్తించలేకపోవచ్చన్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమకు భిన్నమైన భాషా శైలి ఉంటుందని అది ఏఐకి అర్థం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే విధంగా భిన్న ఆంగ్ల యాసలు లేదా వేరే భాషా శైలి ఉపయోగించే విద్యార్థి యాస ఈ క్వీన్ ఇంగ్లీష్ ఆధారిత ఏఐకు అర్థం కాకవచ్చన్నారు. గ్రామర్ తప్పు ఉందనో, లేదా సింటాక్స్ సరిగా లేదనో వేరే విషయాన్ని అందివ్వొచ్చన్నారు.
డిజిటల్ బాధ్యతలపై మార్గదర్శకత్వం అవసరం
చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలతో విద్యార్థులు నిత్యం ట్రావెల్ అవుతున్నందున వారికి నీతి, నిజాయితీ, డిజిటల్ బాధ్యతలపై గైడెన్స్ అవసరం అన్నారు పడాల. ఈ విషయంలో విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.. ఈ టూల్స్ ఎంత వరకు ఉపయోగించాలి, వాటిపై ఎంత వరకు ఆధారపడాలో కూడా తెలియజేయాలి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడమే కాదు ఎక్కడ ఆపలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జెనరేటివ్ ఏఐ యుగంలో సంప్రదాయాలు పాటించాలని చెప్పడం కూడా సవాల్‌గా మారిపోతుందన్నారు. ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఐజాక్ అసిమోవ్ మూడు సూత్రాల మాదిరిగానే ఈ అడ్డంకులు ఏఐ మాదిరిగానే వృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఏఐను న్యాబద్ధంగా వాడుకోవడం అంటే ఈ టూల్స్ ఉపయోగించే వేరే వాళ్ల డేటాను తస్కరించడం చాలా ప్రమాదకరమన్నారు. ఏఐ డిజైన్ చేసిన టూల్‌ను తమదిగా విద్యార్థులు చెప్పుకోవచ్చన్నారు. ఇప్పుడు కొత్త కొత్త టూల్స్‌ను ఉపయోగించి కొత్త మ్యూజిక్‌ను కూడా క్రియేట్ చేస్తోంది. ఇది ఏ స్థాయికి వెళ్తుంది దీనికి ఉన్న హద్దులు ఏంటో తెలుసుకోవాలి. అని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలోనే విద్యార్థులకు డేటాను ఏ స్థాయి వరకు తీసుకోవాలి. వాటిని ఎంత న్యాయబద్ధంగా ఉపయోగించాలి లాంటి విషయాలపై సరిహద్దులు క్రియేట్ చేయాలి. వాటిని అధ్యాపకులు, విద్యాసంస్థలు బోధించాలి అని అన్నారు. అందుకే ఏఐ జనరేషన్‌లో నైతిక అక్షరాస్యత అవసరం అన్నారు.
ఏఐతో కూడిన శక్తిమంతమైన క్లాస్ రూమ్ చూస్తాం
రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఏఐతో కూడిన శక్తిమంతమైన తరగతి గది ఉంటుందని అన్నారు. అక్కడ కూడా సంప్రదాయ ఉపాధ్యాయుడే బోధిస్తాడని చెప్పుకొచ్చారు. ఎప్పటికీ ఈ సంప్రదాయ ఉపాధ్యాయుడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్ట్రాంగ్ గా చెప్పారు ఉపాధ్యాయులు ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు. ఎవరికైనా అలాంటి భయం ఉంటే ఏఐ నేర్చుకుని పాఠాలు బోధించాలని సూచించారు.
మార్పునకు వ్యతిరేకం కాదు
తాను మార్పునకు వ్యతిరేకం కాదన్న బీపీ పడాల..మార్పులో ఉన్న మంచిని గ్రహించి తమ వృత్తికి జోడించి ముందుకు సాగాలని సూచించారు. ఏఐ అనేది సునామీగా చూస్తున్నామని ఇప్పుడు భయపడాల్సిన పని లేదని అందులో మునిగిపోకుండా ఎలా ప్రయాణించాలో నేర్చుకోవాలని సూచించారు. విద్యాబోధనలో కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. వాటిలో మంచిని గ్రహించి బోధనకు జోడించాలని తెలిపారు.






















