PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
దేశవ్యాప్తంగా పీఎంశ్రీ (స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందిస్తారు.
దేశవ్యాప్తంగా పీఎంశ్రీ (స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, అధునాతన స్కూల్స్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 2.5 లక్షల పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా.. వీటిలో నుంచి 9 వేలను ఎంపిక చేసింది. ఆహ్లాదకర వాతావరణం, ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన.
ఈ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక కరిక్యులమ్‌తో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వీటికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రయోగశాలలు, క్రీడా సామగ్రి, సిలబస్‌కు అనుగుణంగా డిజిటల్ తరగతి గదులు, ఆర్ట్ స్టూడియోలను ఏర్పాటు చేస్తుంది. పోటీ ప్రపంచానికి తగినట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఏపీ నుంచి 662 పాఠశాలలు ఎంపికయ్యాయి. త్వరలోనే పథాకానికి ఎంపికైన పాఠశాలల జాబితాలను కేంద్రం వెల్లడించనుంది. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందిస్తారు.
పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు ఇంటర్‌నెట్ సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్ దశ నుంచే ఒకేషనల్ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్ ప్లస్)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు.
ఇంకా చేరని రాష్ట్రాలు..
పీఎం శ్రీ పథకంలో ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాల్సి ఉందని సీనియర్ అధికారి చెప్పారు. ఏడు రాష్ట్రాలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో ఎంవోయూ కుదుర్చుకోలేదని తెలిపారు. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, కేరళ, ఢిల్లీ ఇందులో చేరలేదు. దీంతో ఇప్పటికైనా ఒప్పందం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలను కోరినట్లు అధికారి తెలిపారు. దేశంలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్‌కి పీఎం శ్రీ పథకం పాఠశాలలను కేరాఫ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఓ లేఖలో కేంద్రం కోరిందని చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 15న పీఎం శ్రీ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.