(Source: ECI/ABP News/ABP Majha)
EAPCET Results 2021: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే
ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు నేడు (సెప్టెంబర్ 14) విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలు నేడు (సెప్టెంబర్ 14) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7వ తేదీతో ముగిశాయి. కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా మొత్తం 5 విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. జేఎన్టీయూ కాకినాడ (JNTUK) ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
ఇంజనీరింగ్ విభాగాలకు విడుదలైన ఫలితాలు..
ఈఏపీసెట్ (పాత ఎంసెట్) ఇంజనీరింగ్ విభాగం ఫలితాలు ఈ నెల 8న విడుదలయ్యాయి. అంతకు ముందు రోజున అగ్రి, ఫార్మసీ విభాగాల పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఫలితాలను మరో నాలుగు రోజుల తర్వాత విడుదల చేస్తామని.. మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణతా శాతం 80.62గా ఉంది. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో జరిగాయి.
ఏయే కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు?
ఈఏపీసెట్ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీ-ఫార్మసీ, బీఎస్సీ (అగ్రి), ఫార్మా డీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.
ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- ఈఏపీసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఈఏపీసెట్ హాల్ టికెట్ నంబర్ వివరాలు ఎంటర్ చేయండి.
- వ్యూ రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పరీక్ష ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.