(Source: ECI/ABP News/ABP Majha)
TS EAMCET 2021: తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మార్పులు..
తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో ఉన్నత విద్యా మండలి పలు మార్పులు చేసింది. గతంలో విడుదల చేసిన కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్లు ప్రక్రియ వాయిదా పడినట్లు తెలిపింది.
తెలంగాణ ఇంజనీరింగ్ షెడ్యూల్‌లో పలు మార్పులు చేసినట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 4 నుంచి 13వ తేదీ జరగాల్సి ఉంది. అయితే దీనిని ఈ నెల 11 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తామని ప్రకటించింది. ధ్రువపత్రాల పరీశీలన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని విద్యా మండలి తెలిపింది. కాలేజీల గుర్తింపు ప్రక్రియలో జరిగిన జాప్యం వల్ల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పరీక్షలకు 1,47,991 మంది హాజరైతే 1,21,480 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 79,009 మంది హాజరవ్వగా 73,070 మంది (దాదాపు 92.48 శాతం) అర్హత సాధించారు.
నేటి నుంచి గేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)- 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాల్టి నుంచి స్టార్ట్ అయింది. దరఖాస్తు గడువు ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో గేట్ 2022 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. రెండు సెషన్లలో గేట్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) పరీక్ష ఉంటుందని చెప్పింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ .. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఈసారి కొత్తగా రెండు పేపర్లు..
ఈసారి గేట్ పరీక్షలో ఈసారి కొత్తగా జియోమాటిక్స్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ అనే రెండు పేపర్లను ప్రవేశపెట్టినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన రెండింటితో కలిపి మొత్తం గేట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మాత్రమే గేట్ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని.. ఈసారి బీడీఎస్, ఎంఫార్మసీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ వెల్లడించారు. ఎంఫార్మసీ, బీడీఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Also Read: ఏపీ విద్యార్థులకు సిలబస్ కుదింపు.. సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం