BRAOU Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగించారు..
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం braouonline.inను సంప్రదించవచ్చు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో (Ambedkar Open University) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం ప్రవేశాల గడువు నిన్నటితో (ఆగస్టు 27) ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. 2021 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 3వ తేదీ వరకు పెంచినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్ నెలలో విడుదలైంది. వీటి ప్రవేశ గడువును ఇప్పటికే ఒక సారి పొడిగించిన అధికారులు.. తాజాగా మరోసారి పెంచారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు.. పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది.
విద్యార్హత వివరాలు..
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - ఇంగ్లిష్ / తెలుగు మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇవి కూడా ఇంగ్లిష్,తెలుగు మీడియంలలో ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10వ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ గ్రేడ్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు 2020 నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఒకే గ్రేడ్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని విద్యా శాఖ పేర్కొంది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలన్న ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించింది. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తామని తెలిపింది. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండా విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.