GMR School: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ కోర్సు - అర్హతలు, ఎంపిక, శిక్షణ వివరాలు ఇలా
Aviation School: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో 'ఏవియేషన్ స్కూల్' ఏర్పాటైంది. దీనిద్వారా విమానాల నిర్వహణ ఇంజినీరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు.
Shmashabad Airport Aviation School: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో 'ఏవియేషన్ స్కూల్' ఏర్పాటైంది. దీనిద్వారా విమానాల నిర్వహణ ఇంజినీరింగ్(AME -Aircraft Maintenance Engineering) కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో విమానయాన సంస్థల్లో పెరుగుతున్న మానవ వనరులకు అవసరాలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సుకు డీజీసీఏతోపాటు ఐరోపా విమానయాన భద్రతా ఏజెన్సీ (యాసా) అనుమతులు కూడా ఉన్నాయి.
నాలుగేళ్ల ఇంటిగ్రేటెట్ ఇంజినీరింగ్ కోర్సును ఈ జూన్ నుంచే ప్రారంభించనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. తెలంగాణ ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్ష ద్వారా మొత్తం 200 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లోని విమానయాన సంస్థల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాసియాలోనే ఇది తొలి 'ఏవియేషన్ స్కూల్'గా నిలవనుంది. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
కోర్సు వివరాలు ఇలా..
➥ మొత్తం నాలుగేళ్ల వ్యవధి గల ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు(AME)లో మొదటి రెండేళ్లు తరగతులు, తర్వాతి రెండేళ్లు ప్రయోగాత్మక శిక్షణ ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో తరగతులు, పరీక్షల నిర్వహణ ఉంటుంది.
➥ మూడో సంవత్సరం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా విమానాల ఇంజిన్లు, కాక్‌పిట్‌లో సెక్యూరిటీ సిస్టమ్, విమాన చక్రాలు, రెక్కలు పనిచేసే విధానం, విమానం గాల్లో ఉన్నప్పుడు తలుపులు తెరుచుకుంటే వెంటనే చేపట్టాల్సిన చర్యలు, హ్యాంగర్‌లోకి విమానం రాగానే ఇంజిన్ సహా విడిభాగాల పరిస్థితి అంచనా.. వంటి కీలక అంశాలపై శిక్షణ ఉంటుంది.
➥ నాలుగో సంవత్సరంలో విమాన విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి విమానాన్ని రూపొందించాలంటూ టాస్క్‌లు అప్పగిస్తారు. ఇందుకోసం విమానాన్ని పోలిన సిమ్యులేటర్ విమానాన్ని హ్యాంగర్‌లో ఉంచారు. శిక్షణ కాలంలో బోయింగ్-737, ఎయిర్‌బస్320, 320ఏ విమానాల మరమ్మతులపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తారు.
➥ ప్రవేశం పొందిన విద్యార్థులు DGCA మూల్యాంకనం మేరకు మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సును (B1), యాసా మూల్యాంకనం ప్రకారం ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సును (B2) చదవవచ్చని, మరింత ఆసక్తి ఉన్న విద్యార్థులు రెండు కోర్సులూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. నాలుగేళ్ల కోర్సు తర్వాత పట్టా ఇవ్వడంతోపాటు విమాన భద్రత ధ్రువీకరణ అధికారిగా లైసెన్సు ఇస్తారు.
ALSO READ:
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH)-పార్ట్ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు (MTECH, MBA Programmes) అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికెట్ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్ లభించదు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..