AP SSC Supplementary Exam 2022: జూలైలో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, తేదీలు ప్రకటించిన మంత్రి బొత్స
AP SSC Supplementary Exam 2022: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా జూలై 6వ తేదీన ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
AP SSC Results 2022 : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలను నేటి మధ్యాహ్నం (జూన్ 6)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడ ఎమ్‌జీ రోడ్డు వద్ద నున్న గేట్‌వే హోటల్ లో ఫలితాలు విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది సైతం బాలురి కంటే బాలికలదే పైచేయి. ఫలితాలను కేవలం మార్కుల రూపంలో విడుదల చేశారు. మొత్తం 4.14 లక్షల మంది విద్యార్తులు టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఫలితాలు విడుదల చేసిన తరువాత సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. వచ్చేనెల జూలై 6వ తేదీన ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూలై 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.
ఆ స్కూల్స్‌లో ఒక్కరూ పాస్ కాలేదు..
రాష్ట్రంలో 11,671 స్కూళ్ల విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా 71 స్కూళ్లలో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. అయితే 797 స్కూళ్లు మాత్రం 100కు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. కరోనా కారణంగా విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జూన్ 7వ తేదీ నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఈ మేరకు జూన్ 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే సప్లిమెంటరీ విద్యార్థుల ఫలితాలు సైతం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి, రెగ్యూలర్ విద్యార్థులతో ఇంటర్ లో చేరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు.
ఈ సారి బాలికలదే పైచేయి..
ఈ ఏడాది ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 27నుంచి మే 9వరకు జరిగాయి. రెండేళ్ల తరువాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరు కాగా, 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,11,460 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 2,02,821 మంది పాసయ్యారు. టెన్త్ ఫలితాలలో సరాసరి 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లాలో అత్యధిక శాతం 78.3 శాతం విద్యార్థులు మంది ఉత్తీర్ణులవగా, అనంతపురం 49.7 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 64.02 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్