(Source: ECI/ABP News/ABP Majha)
APEAPCET: ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత, ఉన్నత విద్యామండలి తీరుపై విమర్శలు
చాలామంది విద్యార్థులు మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందనే ఉద్దేశంతో కళాశాలలు, కోర్సుల కోసం ఐచ్ఛికాలు ఇచ్చారు. మూడో విడత కౌన్సెలింగ్ ఉంటే వీటిని మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఏపీలో ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యామండలి రద్దుచేసిన సంగతి తెలిసిందే. అయితే కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నా ఉన్నత విద్యామండలి పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఉన్నత విద్యామండలి ఈ ఏడాది రెండు విడతలే నిర్వహించింది. చాలామంది విద్యార్థులు మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందనే ఉద్దేశంతో కళాశాలలు, కోర్సుల కోసం ఐచ్ఛికాలు ఇచ్చారు. కొంతమందికి మొదటి విడతలో వచ్చిన కళాశాలలోనే రెండో విడతలోనూ సీటు రాగా మరికొందరికి దూరంగా ఉన్న విద్యా సంస్థల్లో వచ్చాయి. మూడో విడత కౌన్సెలింగ్ ఉంటే వీటిని మార్చుకునే అవకాశం ఉంటుంది.
కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు చేయకుండానే మూడో విడత తీసేసింది. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. కన్వీనర్ కోటాలో చేరే వారిలో ఎక్కువమంది పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే ఉంటారు. ఇప్పుడు మూడో విడత కౌన్సెలింగ్ లేకపోవడంతో వారు డబ్బులు చెల్లించి స్పాట్ లేదా యాజమాన్య కోటాలో చేరాల్సి వస్తోంది. రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను భర్తీ చేసుకునేందుకు కళాశాలలకు స్పాట్ కోటా ఇచ్చేసింది. దీంతో విద్యార్థులు నిత్యం ఉన్నత విద్యామండలికి వచ్చి వినతిపత్రాలు సమర్పిస్తున్నా స్పందించడం లేదు. కన్వీనర్ కోటాలో సీట్లున్నా ఫీజుల భారం తగ్గించుకునేందుకే ఉన్నత విద్యామండలి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బోధన రుసుములు తప్పించుకునేందుకేనా?
స్పాట్ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు ఉండదు. అదే మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా చేరితే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో అక్టోబరు 3న ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టాలని కోరారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు ఒక విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని వారు విమర్శిస్తున్నారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ నోటిఫికేషన్ ఇచ్చినందున చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి.
11 వరకు స్పాట్ ప్రవేశాలు..
రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ ప్రవేశాల ప్రక్రియ 18 వరకు కొనసాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 11 వరకు స్పాట్ ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే రోజుకు రూ.2000 ఆలస్య రుసుముతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడానికి అక్టోబరు 18 వరకు అవకాశం కల్పించారు.
స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూలు ఇలా..
➥ 'స్పాట్' ప్రవేశాల ఖాళీలను పొందడం: 04.10.2023 - 11.10.2023.
➥ సర్టిఫికేట్స్ అప్‌లోడింగ్: 04.10.2023 - 11.10.2023.
➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 04.10.2023 - 11.10.2023.
➥ రోజుకు రూ.2000 ఆలస్య రుసుముతో సర్టిఫికేట్స్ అప్‌లోడింగ్‌కు అవకాశం: 12.10.2023 - 18.10.2023.
➥ రోజుకు రూ.2000 ఆలస్య రుసుముతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 12.10.2023 - 18.10.2023.
అవసరమైన సర్టిఫికేట్లు..
➥ ఇంటర్ మార్కుల మెమో, ప్రొవిజినల్ సర్టిఫికేట్
➥ ఇంటర్ మార్కుల మెమో
➥ ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులైతే బ్రిడ్జ్ కోర్సు (మ్యాథ్స్/ బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ స్టడీ సర్టిఫికేట్లు
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
➥ ఆధార్ కార్డు
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(అవసరమైనవారికి)