Degree Courses: డిగ్రీ ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆదరణలేని కోర్సులు తొలగింపు!
Degree Courses Elimination: ఏపీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీలో విద్యార్థుల సంఖ్య కనీసం 25 శాతం ఉన్న కోర్సులనే కొనసాగించనున్నారు.
Degree Course News: ఏపీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీ కాలేజీలో విద్యార్థుల సంఖ్య కనీసం 25 శాతం ఉన్న కోర్సులనే కొనసాగించనున్నారు. విద్యార్థుల సంఖ్య తగినంత లేని కోర్సులను మూసివేసి, అక్కడ ఉండే అధ్యాపకులను వేరేచోట్ల సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
డిగ్రీలో తీసుకొచ్చిన సింగిల్ మేజర్‌తో చాలా కోర్సులు మూతపడుతుండగా.. అధ్యాపక పోస్టుల సంఖ్య తగ్గిపోతోంది. చాలా కళాశాలల్లో భౌతికశాస్త్రం మేజర్ కోర్సులో ఎక్కువమంది చేరలేదు. కొన్ని కళాశాలల్లో ఈ మేజర్‌లో సున్నా ప్రవేశాలున్నాయి. ఆర్ట్స్ కోర్సుల్లో సెక్షన్‌కు 40, సైన్సు కోర్సుల్లో 60 మంది విద్యార్థులు ఉండాలను నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది.
మేజర్ సబ్జెక్టుల ఆధారంగా పని భారాన్ని లెక్కించి అధ్యాపకులను సర్దుబాటు చేయబోతోంది. ఇటీవలే డిగ్రీ అధ్యాపకులకు బదిలీలు జరిగాయి. ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో పోస్టులను మార్చితే దూరం వెళ్లాల్సి వస్తుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధన ప్రకారం డిగ్రీ అధ్యాపకుడికి వారానికి 16 గంటలు బోధన పని గంటలు ఉండాలి. కళాశాల విద్యాశాఖ దీన్ని పట్టించుకోకుండా హేతుబద్ధీకరణ చేపట్టింది. ఇప్పటికే కళాశాలల నుంచి పని భారంపై నివేదిక తీసుకుంది. వీటిపై ఆర్జేడీలు కసరత్తు చేసి, కమిషనరేట్‌కు నివేదిక ఇవ్వనున్నారు.
అధ్యాపకుల సర్దుబాటు..
ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తక్కువగానే ఉన్నాయి. దీంతోపాటు సెక్షన్‌లో కనీసం 25 శాతం ప్రవేశాలు ఉండాలనే నిబంధన పెట్టడం, మేజర్ సబ్జెక్టు ప్రధానంగా పని గంటలను లెక్కించడంతో అధ్యాపకుల మిగులు ఎక్కువగా తేలబోతోంది. సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో రెండో ఏడాది నుంచి మైనర్ సబ్జెక్టులు ఉంటాయి.
ఈ ఏడాది నుంచే ఈ విధానం మొదలైనందున వచ్చే సంవత్సరం మైనర్ సబ్జెక్టులు వస్తాయి. కానీ, అధికారులు మైనర్ సబ్జెక్టులను పట్టించుకోకుండా మేజర్ సబ్జెక్టుల పని గంటల ఆధారంగా అధ్యాపకులను లెక్కిస్తున్నారు. మేజర్, మైనర్‌తోపాటు నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. 25 శాతంలోపు ప్రవేశాలున్న కోర్సుల్లోని విద్యార్థులను ఇప్పటికే వేరే కళాశాలలు, కోర్సులకు సర్దుబాటు చేశారు.
కౌన్సెలింగ్ సమయంలోనే తక్కువగా చేరిన వారిని ఐచ్ఛికాలు మార్చుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలామంది వారికి నచ్చిన కోర్సు కోసం ఇతర కళాశాలలను ఎంపిక చేసుకోగా.. కొందరు అదే కళాశాలలో చదివేందుకు కోర్సులను మార్చుకున్నారు. డిగ్రీలో చేరిన వారిలో ఎక్కువమంది సైన్సు సబ్జెక్టుల్లోనే ఉన్నారు. ఇక్కడ సెక్షన్‌కు 60 మందిని అమలు చేయడంతో పని భారం తక్కువగా ఉన్నట్లు చూపుతున్నారు.
ALSO READ:
బీఎస్సీ అలైడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు ఇలా..
తెలంగాణలోని బీఎస్సీ అలైయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేయనున్నారు. విద్యార్థులు అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.