Air Hostess Course After Intermediate: ఎయిర్‌హోస్టెస్ అవ్వాలనుందా, అయితే ఇలా చేయండి
ఎయిర్‌హోస్టెస్‌గా సెటిల్ అవ్వాలనుకునే వాళ్లకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. తక్కువ ఫీజుతోనే ఎక్కువ శాలరీతో ఉద్యోగం సంపాదించవచ్చు.
ఎయిర్‌హోస్టెస్ అవ్వాలంటే ఇవి తప్పనిసరి..
ఎయిర్‌లైన్స్‌లో అందరికీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే జాబ్ ఎయిర్ హోస్టెస్. ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణం చేసేలా చూడటమే వీరి విధి. ఇందుకోసం ఎంతో శిక్షణ, సహనం అవసరం. అంతకు మించి మనకంటూ కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలుండాలి. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టపడే వాళ్లు ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్‌లో పట్టు ఉండి ఇంటర్మీడియట్ చేసిన వాళ్లు ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేయటానికి అర్హులు. వ్యాలిడ్ పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలి. కంటిచూపులో ఎలాంటి లోపాలు ఉండకూడదు. సర్టిఫికేట్ కోర్స్ కానీ లేదంటే డిప్లొమా కానీ చేసేందుకు వీలుంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..
ఎయిర్ హోస్టెస్ కోర్స్‌లో చేరాలనుకునే వాళ్లు ముందుగా యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. అనలిటికల్ అబిలిటీని పరీక్షించేలా ఉంటాయి ఈ ప్రశ్నలు. ఈ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్లకు గ్రూప్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది. ఓ గ్రూప్‌లో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది గమనిస్తారు. క్యాబిన్ క్రూలో పని చేసే వాళ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. అందుకే గ్రూప్ డిస్కషన్ రౌండ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ రెండింట్లోనూ క్వాలిఫై అయిన వాళ్లకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేయటానికి ఫలానా క్యాండిడేట్ కరెక్టా కాదా అన్నది ఈ ఇంటర్వ్యూలోనే డిసైడ్ చేస్తారు. ఈ రౌండ్‌లోనూ క్వాలిఫై అయితే తరవాత మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. విజన్, హియరింగ్ టెస్ట్‌లు, బ్లడ్ టెస్ట్, ఆల్కహాల్ టెస్ట్ లాంటివి చేస్తారు. ఈ అన్ని రౌండ్లలోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి శిక్షణ మొదలు పెడతారు.
ట్రైనింగ్‌లో ఏం నేర్పిస్తారు..?
ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఎలాపని చేయాలి, ప్రయాణికులకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి అనే అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ఎయిడ్ సహా కొన్ని మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్‌కి ఒక్కో సంస్థ ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తోంది. యావరేజ్‌గా చూస్తే మాత్రం ఈ కోర్స్ ఫీజు రూ. 80,000 నుంచి రూ. 1,50,000 వరకూ ఉంటుంది. BBA ఏవియేషన్, MBA ఏవియేషన్ లాంటి కోర్స్‌లు చేయాలనుకుంటే ఈ ఫీజ్ ఎక్కువగా వసూలు చేస్తారు.
ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే..
ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ సంస్థ ఎయిర్ హోస్టెస్ శిక్షణనివ్వటంలో టాప్‌లో ఉంది. గోవా, బెంగళూరు, గుజరాత్, దిల్లీల్లో ఈ ఇన్‌స్టిట్యూట్‌లున్నాయి. ఆ తరవాత ముంబయిలోని బాంబే ఫ్లైయింగ్ క్లబ్ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ టాప్ సెకండ్‌లో ఉంది. ముంబయిలోనే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీ, గుడ్‌గావ్‌లోని స్పైస్‌జెట్ ఏవియేషన్ అకాడమీల్లోనూ ఎయిర్‌హోస్టెస్ కోర్స్అం దుబాటులో ఉంది. ఈ కోర్స్ వ్యవధి 8 నెలలు. యావరేజ్ సాలరీ రూ.5 లక్షలకుపైమాటే.
Also Read: Defence Courses After Inter: ఇంటర్ తరవాత డిఫెన్స్‌లో చేరాలంటే, ఈ కోర్సులు చేయాల్సిందే
Also Read: Courses After Inter: ఇంటర్ తర్వాత ఏం చేయాలి? అందుబాటులో ఉన్న కోర్సులేంటి?