Warangal News: రీల్స్ పిచ్చి - ఉరి బిగుసుకుని యువకుడు మృతి, వరంగల్ జిల్లాలో ఘటన
Telangana News: ఇన్ స్టా రీల్స్ మోజు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉరి వేసుకుంటున్నట్లుగా రీల్చ్ చేద్దామని ప్రమాదవశాత్తు అది బిగుసుకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.

Young Man Died While Doing Insta Reels: ఇన్ స్టా రీల్స్ మోజులో కొందరు యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాగే ఓ యువకుడు ఇన్ స్టా రీల్స్ పిచ్చిలో సరదాగా ఉరి వేసుకుంటున్నట్లు వీడియో చేయబోయి నిజంగానే అది గొంతుకు బిగుసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేటలో (Narsampeta) చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ స్థానికంగా ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం హోటల్‌లో పని పూర్తైన అనంతరం తన అక్క ఇంటికి వెళ్లాడు. అతనికి ఇన్ స్టా రీల్స్ చేయడం అంటే పిచ్చి. ఈ క్రమంలో ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరి వేసుకున్నట్లుగా రీల్ చేద్దామని ప్రయత్నించాడు.
దూలానికి వేలాడుతూ..
ఇంట్లోని ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్ చేసేందుకు యత్నించాడు. దూలానికి ఉరితాడు వేలాడదీసి.. అనంతరం ఉరి వేసుకుంటున్నట్లుగా రీల్ చేద్దామని అనుకున్నాడు. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో గొంతుకు ఉచ్చు బిగుసుకుని ఊపిరాడక మృతి చెందాడు. బుధవారం ఉదయం నిద్ర లేచిన కుటుంబ సభ్యులు ఉరికి యువకుడు వేలాడడం చూసి షాకై కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ అజయ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

