మేం ప్రేమికులం కాదు ? మా చావుతోనైనా అర్థం చేస్కోండి!
వారిద్దరూ మంచి స్నేహితులు. కానీ అందరూ ప్రేమికులని అనడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స పొందుతూ అబ్బాయి మృతి చెందగా, అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ మధ్య ఓ అమ్మాయి, అబ్బాయి ఎక్కడైనా కనిపించారంటే చాలు. వారిద్దరూ ప్రేమికులనే ముద్ర వేసేస్తారు. అన్నా చెల్లెల్లు కనిపించినా అదే ధోరణితో చూస్తుంటారు. వారి మొహం మీదే చాలా కామెంట్లు చేస్తుంటారు. మరికొందరేమో గుచ్చి గుచ్చి చూస్తూ.. వారు ఇబ్బంది పడేలా చేస్తుంటారు. లోకులు ఇలా చేస్తుంటే కొంతమంది చాలా లైట్ తీస్కుంటారు. మరి కొందరేమో పదే పదే దాన్ని తలుచుకుంటూ కుమిలిపోతుంటారు. అందరి ముందు పరువు పోయిందని ఏం చేస్కోవడానికైనా వెనుకాడరు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
స్నేహితులపై ప్రేమికులనే ముద్ర వేయడం వల్లే..
జిల్లాలోని నందిపేట్ మండలానికి చెందిన ఓ అమ్మాయి, అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. యువతి, యువకుడు పురుగుల మంది తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడు వినయ్ కుమార్ మృతి చెందగా.. యువతి నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం.. వారిద్దరి మధ్య ప్రేమ అనే మద్ర వేయడమనే తెలుస్తోంది. స్నేహితులైన తమను అంతా ప్రేమికులని అనుకుంటున్నారని, తాము ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోట్లేదని బలవన్మరణానికి పాల్పడే ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేస్కున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మొన్నటికి మొన్న మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక..
ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వారు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. అల్లారు ముద్దుగా పాపను పెంచుకుంటూ హాయిగా జీవనం సాగించారు. కానీ పాప పుట్టిన రెండేళ్లకే అతడి భార్య అకాల మరణం చెందింది. ఆమె మృతిని అతడు జీర్ణించుకోలేకపోయాడు. చాలా రోజుల పాటు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నాడు. కానీ అలా ఉంటే పాప ఒంటరి అవుతుందని నీవు మరో పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. తన కోసం కాకపోయినా పాప కోసమైనా పెళ్లి చేసుకోక తప్పదని భావించిన అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
గత ఏడాది రెండో భార్య కూడా గర్భం దాల్చింది. వీరికి పాప కూడా పుట్టింది. కానీ అతను మాత్రం మొదటి భార్యను మర్చిపోలేకపోతున్నాడు. ఆమె చనిపోయిన నాటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా సమాధి వద్దకు వెళ్లి కాసేపు గడిపి తిరిగొచ్చేవాబు. ఈ మధ్య ఎందుకో తెలియదు, మొదటి భార్య గుర్తుకొచ్చి మరింతగా బాధ పడుతున్నాడు. అది తట్టుకోలేక ఆమె సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘనట స్థానికంగా సంచలనం రేపింది.
కొంతమంది చాలా సెన్సిటివ్ గా ఉంటారని, అలాంటి వాళ్లు మాత్రమే దేన్నీ తట్టుకోలేక ఆత్మహత్యలు చేస్కుంటారని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలను మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా తయారు చేయాలని అప్పడే వారు జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యను తట్టుకొని హాయిగా జీవిస్తారని సూచిస్తున్నారు.