Yadadri Bhuvanagiri: ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో అప్పులు చేసిన ఇల్లాలు - అవి కట్టలేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య
Yadadri Bhuvanagiri: ఇంట్లోనే ఉంటూ అప్పులు చేసి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడింది. అవి తీర్చలేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొని.. భర్తను ఒంటరి వాడిని చేసింది.
Yadadri Bhuvanagiri: ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు. పిల్లలు చిన్న వాళ్లు కావడంతో ఇంట్లోనే ఉంటూ వారిని చూసుకుంటుంది. అయితే లారీ డ్రైవర్ గా పని చేసే భర్త.. భార్యాపిల్లల కోసం చాలా కష్ట పడుతున్నాడు. కానీ ఇంటి వద్దే ఉంటూ పొద్దుపోని ఆ ఇల్లాలు... ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడింది. అప్పులు చేస్తూ మరీ గేమ్స్ ఆడింది. తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల దగ్గర కలిపి మొత్తంగా 8 లక్షలు తీసుకొని గేమ్స్ ఆడి పోగొట్టుకుంది. అయితే అప్పుల వాళ్లు డబ్బులు అడుగుతుండడంతో తమకున్న ఓ స్థలాన్ని అమ్మి కట్టాలనుకుంది. కానీ భర్త అందుకు ఒప్పుకోకపోవడంతో.. ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమారులను నీటి సంపులో పడేసి తానూ దూకేసింది..
అసలేం జరిగిందంటే..?
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేష్ లారీ డ్రైవర్. అయితే ఈయనకు 28 ఏళ్ల భార్య రాజేశ్వరి, ఐదేళ్ల కుమారుడు అనిరుధ్, మూడేళ్ల కుమారుడు హర్ష వర్ధన్ ఉన్నారు. వీరంతా చౌటుప్పల్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వరి కొన్నేళ్లుగా పిల్లలను చూసుకోవడం కోసం ఇంట్లోనే ఉంటుంది. ఏడాది నుంచి ఆన్ లైన్ లో గేమ్స్ ఆడేందుకు అలవాటు పడింది. ఇలా తెలిసిన వాళ్లు, బంధువులు వద్ద అప్పులు చేసుకుంటూ మొత్తం 8 లక్షల రూపాయలను గేమ్స్ లో పోగొట్టుకుంది. అయితే అప్పు తీసుకొని కాలం గడుస్తుండగా.. అంతా డబ్బు తిరిగివ్వాలని అడిగారు. ఒక దగ్గరి బంధువు మంగళ వారం రోజు సాయంత్రం ఇంటికి వచ్చి మరీ అడిగారు. ఆ సమయంలో భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడు. అయితే రాజేశ్వరి.. తమకున్న స్థలాన్ని అమ్మి బాకీలు తీర్చేద్దామని భర్తను కోరింది. కానీ అందుకు మల్లేష్ ఒప్పుకోలేదు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆమెను ఏమీ అనలేక ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే బంధువు కూడా వెళ్లిపోయాడు.
పిల్లలను సంపులో తోసేసి.. తానూ దూకేసింది!
అయితే అవమాన భారంతో మనస్తాపం చెందిన రాజేశ్వరి చనిపోవాలని నిర్ణయించుకుంది. తను లేకుండా పిల్లలు ఉండలేరని.. వాళ్లను కూడా చంపేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా తన ఇద్దరు కుమారులను నీటి సంపులో తోసేసింది. ఆపై ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. కోపంగా ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్త రాత్రి 7 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాపిల్లలు కనిపించకపోవడంతో అంతా వెతికాడు. సంపు మూత తెరిచి ఉండడం గమనించిన మల్లేష్.. అందులోకి తొంగి చూశాడు. వెంటనే ముగ్గురిని బయటకు తీసి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే భార్యాపిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వార్త విన్న మల్లేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఒకేసారి భార్య, పిల్లల చనిపోవడం జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్నాడు. 8 లక్షల కోసం కోట్ల విలువ చేసే కుటుంబం దూరమైందంటూ ఏడుస్తున్నాడు. ఇది చూసిన స్థానికులంతా కంట తడి పెడుతున్నారు. ఆవేశంలో భార్య తీసుకున్న నిర్ణయం తప్పంటూ గుండెలు బాదుకుంటున్నాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial