Women Constable suicide: ఎస్పీ ఆఫీసులో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!
Annamayya district | ఎస్పీ కార్యాలయంలో డ్యూటీలో ఉన్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక మిస్ ఫైర్ అయిందా అనేది తేలాల్సి ఉంది.
Women Constable suicide at sp office in Annamayya district | రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆ ఆఫీసులో సెంట్రీ డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ వేదవతి(26) గన్నుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక మిస్ ఫైర్ అయి ఆమె మృతి చెందిందా అనే విషయమంపై స్పష్టత రాలేదు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వేదవతి
వేదవతి సొంత ఊరు పుంగనూరు దగ్గరలోని బింగానిపల్లె గ్రామం. కాగా, వేదవతి భర్త పేరు దస్తగిరి. ఆయన స్వస్థలం మదనపల్లి. దస్తగిరి పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో ప్యాకల్టీగా పనిచేశాడు. అక్కడ వేదవతి ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో 2016లో వేదవతి, దస్తగిరి వివాహం చేసుకున్నారు. అనంతరం చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేసిన వేదవతి ఏడాది కిందట అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీపై వచ్చింది.
గన్‌తో కాల్చుకుందా? మిస్ ఫైర్ అయిందా?
ప్రస్తుతం వేదవతి భర్త దస్తగిరితో కలిసి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కనగల ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. ఏం జరిగింతో తెలియదు కానీ, ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి గన్ పేలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. ఆమె గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ మిస్ ఫైర్ కావడంతో మృతి చెందిందా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ మేరకు డీఎస్పీ రామచంద్రరావుఅర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు వేదవతి మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు.