Crime News : మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని, మెడకు చున్నీ బిగించి భర్తను చంపేసిన భార్య
Telangana : మద్యం మహమ్మారి ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. రోజు తాగి వచ్చి భర్త పెడుతున్న హింసను భరించలేక భార్య చున్నీని మెడకు బిగించి హత్య చేసింది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
Hyderabad Crime News: మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చుకు కారణమవుతోంది. మద్యం మత్తులో మగవాళ్లు చేసే అరాచకాలకు ఎంతో మంది మహిళలు బలి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ వేధింపులు తట్టుకోలేక మహిళలు కూడా తాగుబోతు భర్తలను హతమార్చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయిన ఇల్లాలు అతని మెడకు చున్నీని బిగించి కంపేసింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్ లస్కర్ (35), రుస్తానా బేగం లస్కర్ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండేళ్ల కిందట వీరు హైదరాబాద్ నగరానికి వచ్చారు. అప్పటి నుంచి మియాపూర్ హఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అలీ హుస్సేన్ లస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా ఈ అలవాటు బానిసత్వానికి దారి తీసింది. నిత్యం మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతోపాటు భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పిల్లలను కూడా కొడుతుండడంతో తీవ్రంగా ఇబ్బందులు పడేది. సోమవారం రాత్రి కూడా అలీ హుస్సేన్ పూటుగా తాగి వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే ఇంట్లో గొడవ చేయడంతోపాటు భార్యను, పిల్లలను కొట్టాడు.
గొడవ పెద్దది కావడంతో చున్నీతో బిగించిన భార్య
మద్యం మత్తులో ఉన్న హుస్సేన్ భార్యను, పిల్లలను తీవ్రంగా కొడుతుండడంతో భార్య రుస్తానా బేగం ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కూడా మరోసారి గొడవకు దిగడంతో సహనం కోల్పోయిన రుస్తానా తన చున్సీతో భర్త అలీ హుస్సేన్ లస్కర్ మెడకు భిగించింది. గట్టిగా చున్నీని బిగించడంతో హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ గురైన బేగం అక్కడి నుంచి పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యను భార్య రుస్తానా బేగం చేసినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హత్య చేసిన విషయాన్ని బేగం అంగీకరించారు. భర్త వేధింపులను భరించలేక చున్నీని తానే మెడకు బిగించి హత్య చేసినట్టు వెల్లడించింది. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. మద్యం మహమ్మారి ఒక ప్రాణాన్ని బలిగొనగా, మరొకరిని జైలు పాలు చేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఇప్పుడు అనాథలుగా మిగిలారు. ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకుంటుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.