Ankita Bhandari Case :ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని షేక్ చేసిన అంకిత కేసులో కోర్టు సంచలన తీర్పు
Ankita Bhandari Case :2022 అంకిత భండారి హత్య కేసులో రిసార్ట్ ఆపరేటర్ పులకిత్ ఆర్య, ఇద్దరు ఉద్యోగులకు ఉత్తరాఖండ్ కోర్టు జీవిత ఖైదు విధించింది.

Ankita Bhandari Case :2022లో జరిగిన అంకిత భండారి హత్య కేసులో ఉత్తరాఖండ్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఒక రిసార్ట్ నిర్వాహకుడికి, అతని వద్ద పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు జీవిత ఖైదు విధించింది. పౌరి జిల్లాలోని యమకేశ్వర్‌లో ఉన్న వనాంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసిన భండారిని సెప్టెంబర్ 18, 2022న రిసార్ట్ నిర్వాహకుడు పులకిత్ ఆర్య, అతని ఇద్దరు ఉద్యోగులు సౌరభ్ భాస్కర్ , అంకిత్ గుప్తా హత్య చేశారు.
వార్తా సంస్థ PTI ప్రకారం... ప్రాసిక్యూషన్ న్యాయవాది అజయ్ పంత్‌ను ఉటంకిస్తూ, అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రీనా నేగి ముగ్గురు దోషులకు రూ. 50,000 జరిమానా కూడా విధించారు. ఆర్య, భండారికి ఏదో విషయంలో వివాదం ఉందని, ఆ తర్వాత ముగ్గురు ఆ మహిళను రిషికేశ్‌లోని కాలువలోకి తోశారని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని పౌడీ జిల్లా నివాసి భండారి, రిషికేశ్‌లోని యమకేశ్వర్‌లోని వనాంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2022లో, రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్య, అతని ఇద్దరు ఉద్యోగులు భాస్కర్, గుప్తా ఆమెను హత్య చేశారు. వచ్చే వీఐపీ గెస్ట్‌లకు ప్రత్యేక సేవలు చేయలేదని వారితో పర్సనల్‌గా గడిపేందుకు అంగీకరించలేదని ఒత్తిడి చేసి చంపేసి రిషికేశ్‌లోని కాలువలోకి తోసినట్లు సమాచారం. ఆమె మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీసే వరకు అదృశ్యమైందని అనుకున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత డెడ్‌బాడీని వెలికి తీశారు.
రాజకీయ పరిణామాలు
పులకిత్ ఆర్య తండ్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ సభ్యుడు వినోద్ ఆర్య. ఈ ఘటన తర్వాత ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంత జరుగుతున్నా తన కుమారుడిని ఇరికించారని అతను వాదిస్తున్నాడు. నేరం చేయని అమాయకుడిగా అభివర్ణిస్తున్నారు. అయితే అతని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వీఐపీ గెస్ట్‌లు వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నట్టు అంకిత తన స్నేహితుడికి చెప్పుకుంది. ఆమె ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోనే చాలా సార్లు ఇలా వేధించినట్టు ఆమె బోరుమంది. అయితే ఆమె కనిపించకుండా పోయిన ముందు రోజు రాత్రి కూడా తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చింది. తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోవడంతో రిసార్ట్ నిర్వాహకులపై అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు చూపించారు. ఆడియోలను వినిపించారు. ఇదే కేసులో కీలక మలుపునకు కారణమైంది.
మొదట్లో దీన్ని పోలీసులు చాలా లైట్ తీసుకున్నారు. కానీ అనుమాన పడ్డట్టుగానే డెడ్‌బాడీ దొరకడం, పోస్టు మార్టం కూడా చంపేసి పడేసినట్టు తేలడంతో నార్మల్ పోలీసులు కేసును తమ చేతుల్లోకి తీసుకున్నారు. అనుమానితులను అరెస్టు చేసి తరలించేటప్పుడు కూడా హైడ్రామా నడిచింది. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన రిసార్ట్‌ను కూల్చేసింది. అంతే కాకుండా కేసు పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపిఎస్ అధికారి దేవి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అంకిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు.
రికార్డు స్థాయిలో 90 రోజుల్లో, ఫాస్ట్ ట్రాక్ విచారణకు నిర్దేశించిన కాలక్రమం ప్రకారం, పోలీసులు 500 పేజీల ఛార్జ్ షీట్‌ను సమర్పించారు. రిసార్ట్ ఉద్యోగులు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, అంకిత స్నేహితులు సహా 100 మందికిపైగా వ్యక్తులను విచారించారు. అంకితను వ్యభిచారంలోకి నెట్టడానికి ఆర్య చేసిన ప్రయత్నాలను ఆమె ప్రతిఘటించినందున లక్ష్యంగా చేసుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ వాదనకు చాట్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, ప్రత్యక్ష సాక్షులు దీని సమర్థిస్తున్నాయి.
ఇన్ని రోజులు సాగిన విచారణ తర్వాత కోర్టు తీర్పును ప్రకటించింది. పులకిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తా అనే ముగ్గురినీ హత్య కేసులో దోషులుగా నిర్ధారించింది.





















