West Godavari Shocker: తండ్రి సమాధి పగలగొట్టి పుర్రె ఫొటోలు తీసి షేర్ చేసిన కుమారుడు
West Godavari Shocker: శ్మశానంలో ఉన్న తండ్రి సమాధి పగల గొట్టి ఆపై తండ్రి పుర్రె బయటకు తీశాడు. అది చాలదన్నట్లు దాన్ని ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా స్నేహితులకు షేర్ చేశాడు.
West Godavari Shocker: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తండ్రి సమాధి పగుల గొట్టి పుర్రెను బయటకు తీశాడు. ఆపై దాన్ని ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. అయితే అతడిపై తన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
నరసాపురం మండలం రుస్తుంబాదకు చెందిన మురాలు జయ ప్రసాద్ గత ఏడాది జులై 13వ తేదీన మృతి చెందాడు. అతనిని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బాక్సులో పెట్టి ఖననం చేశారు. ఆపై సమాధి నిర్మించారు. జయ ప్రసాద్ మొదటి భార్య కుమారుడైన సుజయ్ ఈ నెల 9వ తేదీన తండ్రి జయ ప్రసాద్ సమాధిని పగుల గొట్టి శవ పేటికను తెరిచాడు. ఆపై పుర్రెను ఫొటో తీసి వాట్సాప్ ద్వారా స్నేహితులకు పోస్టు చేశారు. అయితే విషయం తెలుసుకున్న రెండో భార్య కుమారుడు సంజయ్.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుజయ్ తమను కావాలనే అవమాన పరిచాడని, మానసికంగా ఇబ్బంది విధంగా ప్రవర్తించాడని పోలీసులకు వివరించాడు. కేవలం తండ్రి పుర్రెను ఫొటోలు తీయడమే కాకుండా ఊరంతా పుర్రెను చేత పట్టుకొని తిరిగినట్లు చెబుతున్నాడు. సంజయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
"మా నాన్న రుస్తుంబాద్ గ్రామస్థుడు. పోయిన సంవత్సరం జులైలో ఆయన కాలం చేశారు. చనిపోతే మా సొంత స్థలంలో రుస్తుంబాద్ లో ఖననం చేశాం మా నాన్నగారిని. మా కో బ్రదర్ అయినటువంటి మురాల సుజయ్ ఆ సమాధిని లాస్ట్ మంత్ పగులగొట్టి, దాన్ని బ్రేక్ చేసి ఆ సమాధి లోపల ఉన్న ఆ హెడ్ తీసుకొని గ్రామంలో అంతా తిరిగాడు. మాకు జస్ట్ త్రీ డేస్ బ్యాక్ తెలిసింది. మేమిక్కడికి వచ్చి చూడగా.. సమాధి లోపల అంతా చిందరవందరగా ఉంది. సమాధిని మొత్తం పగుల గొట్టేసి ఆ హెడ్ కూడా వేరు చేసేశారు. దీనిపై మేం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీఐ కూడా వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. కానీ బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు. ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం చాలా దారుణం" - మురాల సంజయ్, రెండో భార్య కుమారుడు
నిందితుడు సుజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
జయ ప్రసాద్ రెండో భార్య కుమారుడు సంజయ్.. మరోసారి తండ్రి సమాధిని కట్టించారు. మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడు సుజయ్ ను కఠినంగా శిక్షించాలని కోరారు. అరెస్ట్ చేసినట్లు చేసి మళ్లీ బయటకు పంపించడం సరికాదన్నారు. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వారు సమాజంలో తిరిగితే చాలా ప్రమాదం అని అన్నారు. మానసిక స్థితి సరిగ్గా లేకే ఆయన ఇలా చేశాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు.