పది ఫెయిలైన డాక్టర్లు- పాతికేళ్లుగా వైద్యం చేస్తూ దందా!
ఎవైనా చిన్న చిన్న రోగాలతో వచ్చే వారి దగ్గర డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు.
Warangal News: వారికి డబ్బు మీద విపరీతమైన ఆశ. ఆ ఆశే పదో తరగతి మాత్రమే చదివిన వారిని వైద్యులుగా అవతారం ఎత్తేలా చేసింది. ఉత్తిగా అవతారం ఎత్తడమే కాదండోయ్ వారి వారి పేర్ల మీదుగా ఆస్పత్రులు కూడా పెట్టారు. వచ్చిన వాళ్లకి తమకు తెలిసిన వైద్యం చేయడం, బాగా డబ్బులు గుంజడం.. పరిస్థితి విషమించినట్లు అనిపించగానే పెద్దాసుపత్రికి పంపించడం పరిపాటిగా మారింది. ఇలా వీళ్లు దాదాపు పాతికేళ్ల నుంచి చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
దాదాపు పాతికేళ్లుగా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు..
వరంగల్ పట్టణ కేంద్రంలో ఇద్దరు నకిలీ వైద్యుల బాగోతం బట్ట బయలు అయింది. ఇందులో ఒకరు పదో తరగతి పాస్ అవ్వగా, మరొకరు ఫెయిన్ అయ్యారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మిత్రులు. అయితే గతంలో వైద్యుల వద్ద పని చేసిన అనుభవం, డబ్బులపై ఆశ పెరగడంతో వైద్యులుగా అవతారం ఎత్తారు. అందుకు అవసరం అయ్యే ధ్రువ పత్రాలను కూడా కొనుగోలు చేశారు. ఇద్దరు వేర్వేరుగా ఆస్పత్రులు కూడా పట్టి ప్రజలకు వైద్యం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 25 ఏళ్ల నుంచి వైద్యులుగా చెలామణి అవుతున్న ఇద్దరు నకిలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితులను టాస్క్ ఫోర్స్, ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. నకిలీ వైద్యుల నుంచి 1.28 లక్షల నగదుతో పాటు ఆస్పత్రికి సంబంధించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు.
ధ్రువపత్రాలు కొనుగోలు చేసి గుర్తింపు కార్డులు..
పట్టణంలోని హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేశాడు. వరంగల్ చార్ బౌళి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మిత్రులు. కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ వైద్యుల దగ్గర అసిస్టెంట్లుగా పని చేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆశతో ఓ పథకం పన్నారు. ఇద్దరూ వైద్యులుగా మారాలనుకున్నారు. ఈ క్రమంలోనే బిహార్ లోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వ విద్యాలయం నుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికేట్లతో పాటు గుర్తింపు కార్డులు కూడా కొనుగోలు చేశారు. కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్ బౌళి ప్రాంతంలో 25 ఏళ్లు ఆస్పత్రి నడిపిస్తున్నాడు.
ఎవైనా చిన్న చిన్న రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు. చివరకు నకిలీ వైద్యుల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీసులు.. వరంగల్ రీజనల్ ఆయుష్ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందిుతులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. నకిలీ వైద్యులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్ పోర్స్, పోలీసులను సీపీ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు.