Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్‌లో మహమ్మద్ చాంద్ బాషా ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబంపై సొంత తమ్ముడే కత్తులతో దాడి చేశాడు.
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తి, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వారు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడికి పాల్పడడంతో ఆ కుటుంబంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రంగా కత్తి గాయాలయ్యాయి. ఆస్తి విషయంలో విభేదాలు ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
వరంగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్‌లో మహమ్మద్ చాంద్ బాషా ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు తన సొంత సోదరుడు షఫీతో కలిసి సంవత్సరం కాలం నుంచి పశువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోదరుల మధ్య వ్యాపార లావాదేవీల్లో వివాదం మొదలైంది. దాదాపు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఎంతకూ తన నగదు వాటా తేలక పోవడంతో షఫీ ఆవేశానికి లోనయ్యాడు. ఈ క్రమంలో సొంత అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షఫీ బుధవారం తెల్లవారుజామున చాంద్‌బాషా ఇంటికి వెళ్లాడు. అన్న కుటుంబంపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు.
బుధవారం తెల్లవారుజామున దాదాపు 3-4 గంటల సమయంలో షఫీ.. మరికొందరు వ్యక్తులను తీసుకొచ్చి చాంద్ బాషా ఇంటి తలుపులను కట్టర్ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించాడు. ఇంట్లో నిద్రిస్తున్న చాంద్ బాషాతో పాటు ఆయన భార్య సబీరా బేగం, కుమారులు, బావ మరిది ఖలీంపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో చాంద్‌బాషా, సబీరా బేగం, ఖలీం అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు తెలిపారు. అతని కుమారులు సమద్ (24), ఫహాద్ (26) ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడిలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్లు సమాచారం.
Also Read: Hyderabad Crime: బోటి కూర ఇవ్వనందుకు దాడి.. మసిలే నూనె పోసిన వైనం..
గాయపడ్డ మరికొందరు కుటుంబసభ్యులను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షఫీయే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చాంద్ బాషా కుమార్తె పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చాంద్ పాషా (50), ఖలీల్ (40), సబీరా(42)గా పోలీసులు గుర్తించారు. వ్యాపార లావాదేవీల వాటా విషయంలో సోదరుల మధ్య వివాదాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. తన వాటా దక్కదేమోనని ఆందోళన చెందిన షఫీ తన అన్న కుటుంబాన్ని అంతం చేయాలని భావించాడు. ప్లాన్ ప్రకారమే తన మనుషులతో వెళ్లి చాంద్ బాషా కుటుంబంపై కత్తులతో దాడికి పాల్పడగా ముగ్గురు చనిపోయారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. నిందితుడు షఫీ, అతడికి సహకరించిన వారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
Also Read: Hyderabad Crime News: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై లైంగిక దాడి.. ఆ మహిళ నిలదీయడంతో..!