Warangal Crime: తక్కువ కులం వ్యక్తితో ప్రేమ... కన్న కూతుర్నే హత్య చేసిన అమ్మ, అమ్మమ్మ...
తక్కువ కులానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని కన్న కూతుర్ని హతమార్చారు తల్లి, అమ్మమ్మ. ప్రేమించొద్దని హెచ్చరించినా మాట వినడంలేదని హత్య చేసి ఆత్మహత్యగా నాటకం ఆడారు. చివరకు పోలీసులకు చిక్కారు.
తన మాట వినటం లేదని తల్లితో కలిసి ఓ మహిళ తన కన్న కుమార్తెను హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉబ్బని సమ్మక్క భర్త చనిపోవడంతో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి పెళ్లి అయింది. రెండో కుమార్తె తల్లి వద్దే ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కొన్ని రోజుల క్రితం యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ వ్యవహారం తల్లికి తెలియడంతో కుమార్తెను హెచ్చరించింది. పెళ్లికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ప్రేమ వ్యవహరాన్ని కట్టిపెట్టాలని తల్లి, అమ్మమ్మలు చిన్న కుమార్తెను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువతి వ్యవహరశైలిలో మార్పురాకపోవడంతో కుటుంబ పరువు తీస్తోందని తల్లి, అమ్మమ్మ కలిసి యువతిని హత్య చేశారు.
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు
హత్య చేసి ఆత్మహత్యగా నాటకం
యువకుడు పెళ్లికి నిరాకరించినందుకు తమ కుమార్తె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితులు. గత నెల 19వ తేదీ అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న యువతిని తల్లి గొంతు నులమగా, అమ్మమ్మ యువతి ముఖంపై దిండుతో నొక్కి ఊపిరి అడకుండా చేసి హత్యచేశారు. హత్య అనంతరం నిందితులు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి వినబడే విధంగా గట్టిగా ఆరుస్తూ, ఏడుస్తూ తన కుమార్తె ఏదో మింగి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. చుట్టుపక్కల వారు పర్వతగిరి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు
అనుమానాస్పద మృతిగా కేసు
యువతి తల్లి, అమ్మమ్మతో పాటు చుట్టు ప్రక్కల వారు ఇచ్చిన వాగ్మూలంతో పర్వతగిరి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతిపై మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. యువతి తల్లి, అమ్మమ్మలను మరోమారు విచారించడంతో తమ మాట వినడంలేదని హత్య చేసినట్లుగా అంగీకరించారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.