Vijayawada Crime: బిర్యానీ కోసం బెజవాడలో హత్య, అన్నను హత్య చేసిన తమ్ముడు!
Andhra Pradesh News | ఏపీలో దారుణం జరిగింది. బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా అన్నను హత్య చేసిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Vijayawada Man kills his brother for not providing Biryani to him | విజయవాడ: బిర్యానీ కోసం హత్యలు చేస్తారా అనుకుంటున్నారా? కానీ బెజవాడలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. బిర్యానీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. విజయవాడ గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిర్యానీ ఇప్పించాలని అడిగాడు. రాము బిర్యానీ ఇప్పించకపోవడంతో ఆవేశంతో తమ్ముడు లక్ష్మారెడ్డి కిటికీ చెక్కతో అన్నపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాము హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజంగానే బిర్యానీ ఇప్పించలేదని అన్నను తమ్ముడు హత్య చేశాడా ? ఇంకేమైనా కారణం ఉందా అని పోలీసులు అన్ని కోణాలల్లో దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక గొల్లపూడి సాయిపురం కాలనీలో గాలి తమ్మయ్య అనే వ్యక్తికి సంతానం ముగ్గురు మగ పిల్లలు. అందులో పెద్దవాడు గాలి రాము, రెండో కుమారుడు గాలి సూర్ రెడ్డి, చిన్న కొడుకు లక్ష్మారెడ్డి. వీళ్లు ముగ్గురికి వివాహమైంది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రాత్రి గాలి లక్ష్మారెడ్డి తన పెద్దన్న గాలి రాము ఇంటికి వెళ్లాడు. నా భార్య రొయ్యల బిర్యానీ తీసుకురావాలంది. డబ్బులు ఇవ్వు అని అన్న రాము(30)ను లక్ష్మారెడ్డి అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని తమ్ముడికి చెప్పాడు. అయితే నీవు ఇంటికి పెద్దవాడివి, డబ్బులు ఎందుకు ఇవ్వవు అని అన్న రామును పదే పదే అడిగాడు.
తనవద్ద డబ్బులు లేవని రాము చెప్పడంతో తమ్ముడు లక్ష్మారెడ్డి ఆవేశానికి లోనయ్యాడు. నేను అడిగితే బిర్యానీకి డబ్బులు ఇవ్వవా అంటూ ఓ వస్తువుతో అన్న రామును గట్టిగా కొట్టాడు. నన్ను కొడతావా అంటూ తమ్ముడ్ని రాము తిరిగి కొట్టాడు. దాంతో మరింత ఆవేశానికి లోనైన లక్ష్మారెడ్డి పక్కనే ఉన్న కిటికీ చెక్కతో రాముపై దాడి చేశాడు. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఈరోజు నిన్ను చంపేస్తా అంటూ లక్ష్మారెడ్డి అన్న రామును కిటికీ చెక్కతో గట్టిగా కొట్టడంతో అతడు స్పృహ తప్పిపోయాడు. కోపాన్ని నియంత్రించుకోలేని లక్ష్మారెడ్డి.. వదిన ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా అన్నను కొడుతూనే ఉన్నాడు. ఆమె ఏడుస్తూ సమీపంలో ఉన్న మరిది సూరిరెడ్డి వద్దకు వెళ్లి మీ అన్నా, తమ్ముడు దాడి చేసుకుంటున్నారు, మీ అన్నను తమ్ముడు దాడి చేసి గాయపరిచాడని చెప్పింది. వెంటనే ఇద్దరూ ఇంటికి వెళ్లి చూడగా, లక్ష్మారెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయాడు. తమ్ముడు సూరిరెడ్డి వెళ్లి రాముని పరీక్షించగా, అప్పటికే అన్న చనిపోయాడు. భార్య భవానిపురం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది. సిఐ కె ఉమామహేశ్వర రావు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించారు. దాదాపు గంట తరువాత నిందితుడు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ గొడవలున్నయా, లేక బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదనే హత్య చేశాడా అనేది దర్యాప్తులో తేలనుంది.