(Source: ECI/ABP News/ABP Majha)
PUBG Addiction: పబ్జీకి బానిసైన బాలుడు- ఆడొద్దన్నందుకు తల్లినే కాల్చి చంపేశాడు!
PUBG Addiction: పబ్జీ ఆడొద్దని చెప్పిన తల్లిని కాల్చి చంపాడు ఓ బాలుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
PUBG Addiction: పబ్జీకి బానిసైన ఓ బాలుడు ఏకంగా తల్లినే హత్య చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన కుమారుడ్ని మందలించడమే ఆ తల్లి చేసిన పాపమైంది.
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరిగిందీ దారుణ ఘటన. మొబైల్లో గేమ్స్‌కు అలవాటు పడిన 16 ఏళ్ల బాలుడు తన తల్లిని తుపాకీతో కాల్చేశాడు. లఖ్‌నవూలోని పీజీఐ ప్రాంతంలో ఉంటోన్న సాధనకు 16 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.
సాధన కుమారుడు పబ్జీ గేమ్‌కు బానిసైపోయాడు. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నిసార్లు నచ్చజెప్పేందుకు చూసినా బాలుడు వినిపించుకోలేదు. ఇటీవల ఆమె నిద్రిస్తున్న సమయంలో బాలుడు తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్నర్లను స్ప్రే చేశాడు. ఈ విషయాన్ని ఎవరకీ చెప్పకూడదని తన సోదరిని బాలుడు హెచ్చరించాడు.
ఇలా తెలిసింది
అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి ఎవరో అమ్మను చంపేశారని చెప్పాడు. పోలీసులు సీన్లోకి ఎంటరైన తర్వాత బాలుడు వారికి కట్టుకథ చెప్పాడు. విద్యుత్ షాక్ వల్ల తన తల్లి చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే మృతదేహం పూర్తిగా పురుగులు పట్టిపోయిందని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. శవం చుట్టూ రక్తపు మరకలు ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపడంతో నిజం బయటకు వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: kharif Crops: రైతులకు కేంద్రం శుభవార్త- 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు