నర్స్ కాదు నరరూప రాక్షసి, 17 మంది పేషెంట్స్ దారుణ హత్య - 700 ఏళ్ల జైలు శిక్ష
Nurse Killed Patients: అమెరికాలో ఓ నర్స్ పేషెంట్స్‌కి ఇన్సులిన్ హైడోస్ ఇచ్చి 17 మందిని హత్య చేసింది.
US Nurse Killed Patients With Insulin: అమెరికాలోని ఓ నర్స్ 17 మంది పేషెంట్స్‌ని దారుణంగా హత్య చేసింది. పని చేసిన చోటల్లా ఎవరో ఒకరిని టార్గెట్‌గా చేసుకుని చంపుతూ వచ్చింది. మూడేళ్ల కాలంలో ఇలా చంపుకుంటూ పోయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే హాస్పిటల్‌లో ఉన్న కొంతమంది పేషెంట్స్‌కి మితిమీరి ఇన్సులిన్ డోస్ ఇవ్వడం. అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో కోర్టు అంత కన్నా సంచలనమైన తీర్పునిచ్చింది. ఆ నర్స్‌కి ఏకంగా 700 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 41 ఏళ్ల హెదర్ ప్రెస్డీ (Heather Pressdee) చేసిన ఈ పనిని కోర్టు తీవ్రంగా పరిగణించింది. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...నిందితురాలిపై హత్యా కేసులతో పాటు కొన్ని హత్యాయత్నం కేసులూ నమోదయ్యాయి. మొత్తంగా ఆమె కెరీర్‌లో 22 మంది పేషెంట్స్‌కి పరిమితికి మించిన ఇన్సులిన్ డోస్‌లు (Insulin High Dose) ఇచ్చింది. వాళ్లలో కొంత మందికి అసలు షుగర్ లేనే లేదు.
నైట్‌షిఫ్ట్‌లో ఎవరూ లేని సమయంలో ఈ పని చేసినట్టు విచారణలో తేలింది. బాధితుల్లో కొందరు వెంటనే ప్రాణాలు కోల్పోగా మరి కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారు. మృతుల్లో 43 ఏళ్ల నుంచి 104 ఏళ్ల వయసు వాళ్లున్నారు. ఇన్సులిన్ డోస్ ఎక్కువైతే అది hypoglycemia కి దారి తీస్తుంది. ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకుంది. గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులు ఆ నర్స్ మానసిక స్థితి బాగోలేదని, ఇంత మంది ప్రాణాలతో ఆడుకుందని కోర్టులో వాదించారు. అయితే..గతంలోనూ ఆమె ప్రవర్తనను గమనించిన కొందరు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పదేపదే పేషెంట్స్‌ని బూతులు తిట్టడం, వాళ్లని అసహ్యించుకోవడం లాంటివి చేసేదని తెలిసింది.