Kakinada Accident: కొత్త కారుతో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ - ఇద్దరు స్పాట్ డెడ్, శరీర భాగాలు తెగిపడి..
Andhrapradesh News: కాకినాడలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కొత్త కారులో ర్యాష్ డ్రైవింగ్‌తో రెండు నిండు ప్రాణాలు బలిగొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
Two People Died In Car Hit With Rash Driving In Kakinada: అసలే కొత్త కారు.. అందులోనూ మద్యం తాగి ఉన్నాడు.. ర్యాష్ డ్రైవింగ్‌తో రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు ఓ వ్యక్తి. కాకినాడ కల్పన సెంటర్ (Kakinada Kalpana Center) వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా.. అందులోని వారికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ కల్పన సెంటర్‌లో శనినారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. కొత్త కారు (ఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్) ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి కల్పన సెంటర్ వైపు అతి వేగంగా వస్తూ ఎదురుగా వస్తోన్న రెండు బైక్స్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి వెనుక మరో బైక్‌పై వెళ్తున్న జక్కం దుర్గాప్రసాద్ (32) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు పేర్రాజుపేటకు చెందిన పీతా సతీష్ (32), కాకినాడ అవసరాల వీధికి చెందిన బి.లక్ష్మణ్‌గా గుర్తించారు.
మద్యం మత్తులోనేనా..!
రామకృష్ణారావుపేటకు చెందిన చల్లా రామ్మోహన్ కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఇతనికి తీవ్ర గాయాలు కాగా.. అదే వాహనంలో ఉన్న మరో యువతికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు పడ్డాయని స్థానికులు తెలిపారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు భావిస్తున్నారు. రద్దీగా ఉండే కూడలిలో మితిమీరిన వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. కారు బైక్స్‌పై దూసుకెళ్లిన అనంతరం సర్కిల్‌లోని సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈ క్రమంలో అక్కడ ఐరన్ రెయిలింగ్ ధ్వంసమైంది.
చెల్లాచెదురుగా శరీర భాగాలు
ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఓ మృతదేహం నుంచి చెయ్యి విడిపోయి వేరే చోట పడగా.. తల నుజ్జయింది. రెండో వ్యక్తి కాలు నుజ్జయ్యింది. కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, త్రీటౌన్ సీఐ కృష్ణ భగవాన్, టూటౌన్ సీఐ నాగేశ్వర్ నాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారును క్రేన్‌తో తొలగించి స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పూర్తి విచారణ తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు.